Virender Sehwag Slams West Indies Cricket Teama after fail to qualify ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫైయింగ్ రౌండ్‌లో వరుసగా 4 విజయాలు అందుకున్న శ్రీలంక మెగా టోర్నీకి అర్హత సాధించింది. దాంతో 10 జట్లు పాల్గొనే వన్డే ప్రపంచకప్ టోర్నీలో 9 జట్లు తేలిపోయాయి. మిగిలిన ఒక స్థానం కోసం జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య పోటీ నెలకొంది. అయితే కచ్చితంగా మెగా టోర్నీకి అర్హత సాధిస్తుందనుకున్న వెస్టిండీస్.. చెత్త ఆటతో మూల్యం చెలించుకుంది. ఒకప్పటి మేటి జట్టు అయిన విండీస్.. చిన్న జట్ల చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మాజీలు అందరూ విండీస్ ఓటమికి కారణాలు చెబుతున్నారు.
విండీస్ ఓటమిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ప్రాంతీయ రాజకీయాలే వెస్టిండీస్ క్రికెట్‌ను దెబ్బ తీశాయని అభిప్రాయపడ్డాడు. ‘వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ 2023కు అర్హత సాధించలేకపోవడం సిగ్గుచేటు. నైపుణ్యం ఉంటే సరిపోదు. రాజకీయాలకు అతీతంగా ఒక జట్టును నడిపించాలనడానికి వెస్టిండీస్ మంచి ఉదాహరణ. రాజకీయాలే వెస్టిండీస్ క్రికెట్‌ను దెబ్బ తీశాయి. ఇంతకుమించి పడిపోవడానికి ఆ జట్టుకు ఇంకేమి మిగల్లేదు’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
Also Read: Flight Ticket Offers: రూ.1499కే విమాన టిక్కెట్.. బంపర్ ఆఫర్ ఇంకా ఒక్క రోజు మాత్రమే!
వెస్టిండీస్ పతనం ఇప్పటిది కాదని, ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు క్రికెట్‌లోకి రాకముందు నుంచే మొదలైందని వెస్టిండీస్ మాజీ పేసర్ ఇయాన్ బిషప్ పేర్కొన్నాడు. ‘నెమ్మదిగా జరిగిన పతనం ఇది. ప్రస్తుత జట్టు క్రికెట్ మొదలుపెట్టకముందే విండీస్ పతనం మొదలైంది. దాదాపు పదేళ్లుగా వన్డేల్లో అగ్ర జట్లపై సరైన ప్రదర్శన చేయట్లేదు. టీ20ల్లో మాత్రమే 2 సార్లు ఛాంపియన్స్ అయ్యాం. ఆ తర్వాత మెరుపులు, విజయాలు పెద్దగా లేవు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినట్లుగా విండీస్ ఇప్పుడు లేదు. మిగిలిన జట్లు రోజు రోజుకు బలపడితే విండీస్ బలహీనంగా మారింది’ అని ఇయాన్ బిషప్ నిరాశ వ్యక్తం చేశాడు.
‘టెస్ట్ ఫార్మాట్ ఆడే నైపుణ్యం విండీస్ ఆటగాళ్లలో తగ్గిపోయింది. బోర్డు ఆర్థిక సంక్షోభం కూడా ఇందుకు ఓ కారణం. అయితే ఆర్థిక పరిస్థితులే క్రికెట్ పతనానికి కారణమని నేను అనుకోవట్లేదు. ఇంతకంటే దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న జింబాబ్వే జట్టు వేగంగా కోలుకుంది. ప్రస్తుతం ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్ టోర్నీలో బాగా ఆడుతోంది. ప్రస్తుత విండీస్‌కు మంచి ప్రదర్శన చేసే సత్తా ఉందని నేను నమ్ముతున్నా. కెప్టెన్, కోచ్‌లు మారారు. వారికి కాస్త సమయం ఇవ్వాలి. తక్కువ వనరులతోనే జింబాబ్వే బాగా ఆడుతుంటే.. విండీస్ ఎందుకు మెరుగుకాకూడదు’ అని ఇయాన్ బిషప్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: BAN vs IND: బంగ్లాదేశ్ టూర్‌కు భారత జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ప్లేయర్‌లపై వేటు!