Site icon NTV Telugu

Weather Update: తడిసి ముద్దైన తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు!

Telangana Rains

Telangana Rains

Weather Update: తెలంగాణ రాష్ట్రం అంతటా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక జిల్లాల్లో రోడ్లు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గౌరారంలో 23.5 సెం.మీ, ఇస్లాంపూర్‌లో 17.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి, చిన్నశంకరంపేట, దామరంచ, మాసాయిపేటల్లో కూడా 15–17 సెం.మీ వరకు వర్షాలు కురిశాయి. సిద్ధిపేట జిల్లాలోనూ భారీ వర్షాలు కురవడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు, సంగారెడ్డి జిల్లాలో కంగ్టి 16.6 సెం.మీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో కుండపోత వాన కురిసి పిట్లం, హసన్‌పల్లె, ముగ్ధంపూర్, నస్రుల్లాబాద్ ప్రాంతాల్లో 15 సెం.మీ వర్షపాతం నమోదైంది. పొంగిపొర్లుతున్న వాగులు రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరదతో నిండిపోవడంతో అధికారులు ఏడు గేట్లు ఎత్తి, 58,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే, మహబూబ్‌నగర్‌లోని జూరాల ప్రాజెక్ట్ వరద నీటితో నిండిపోవడంతో 17 గేట్లు ఎత్తి 1.53 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 8.95 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి మట్టం 1088 అడుగుల వద్ద నిలిచింది. ఇన్‌ఫ్లో 1.48 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి.

LIC Recruitment 2025: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.లక్షన్నర జీతంతో ఎల్ఐసీలో ఉద్యోగాలు!

అలాగే ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో వర్షపు నీరు ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి ప్రాంతాల్లో ఉత్పత్తి ఆగిపోయింది. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఆదిలాబాద్‌లో 11,200 ఎకరాల్లో, మంచిర్యాలలో 6,700 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మంచిర్యాలలో శ్రీరాంపూర్, కళ్యాణి ఖని, ఖైరిగూడ, ఇందారం ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

Manchu Manoj : మనోజ్ ట్వీట్.. మంచు ఫ్యామిలీలో వివాదాలు ముగిసినట్టేనా..?

ఇది ఇలా ఉండగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మక్తల్, మాగనూర్, ఉట్కూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తోంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తూ పలు జిల్లాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, అధికారులు కంట్రోల్ రూమ్‌ల ద్వారా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

Exit mobile version