Panchayat Level Weather Forecast from Next Week: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వచ్చే వారం నుంచి పంచాయతీ స్థాయి వరకు వాతావరణ సూచనలను అందజేయనుంది. అంటే.. ఇక నుంచి ప్రతి గ్రామ ప్రజలు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. జనవరి 15 నుంచి వాతావరణ సమాచారాన్ని బ్లాక్ స్థాయి నుంచి గ్రామ పంచాయతీ స్థాయికి విస్తరిస్తున్నట్టు ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్, హిందీ సహా 12 భారతీయ భాషల్లో ఈ సమాచారం అందుబాటులో ఉంటుందని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు ఈ సమాచారం మేలు చేస్తుందని ఐఎండీ చీఫ్ పేర్కొన్నారు.
ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ… ‘వాతావరణ సూచనల్ని మండలాల స్థాయి నుంచి గ్రామాలకు తీసుకువెళ్లడం సాధ్యమైంది. పంచాయతీ స్థాయి వాతావరణ సేవల ద్వారా దేశంలో ప్రతి గ్రామంలో కనీసం 5మంది రైతులతో అనుసంధానం కావాలనేది మా లక్ష్యం. వాతావరణ హెచ్చరికలతో పాటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. గాలిలో తేమశాతం.. గాలుల వేగం వంటి వివరాలను పంచాయతీ వాతావరణ సేవ ద్వారా పొందవచ్చు. ఏడాది పాటు జరిగే ఐఎండీ 150వ వార్షికోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ‘ప్రతి చోటా వాతావరణం.. ఇంటింటికీ వాతావరణం’ పేరుతో ఈ కొత్త సేవను అదేరోజు ప్రారంభిస్తున్నాం’ అని తెలిపారు.
Also Read: Cow Record Milk: ఒకే రోజులో 80 లీటర్ల పాలు ఇచ్చి.. బుల్లెట్ బైక్‌ను సొంతం చేసుకున్న ఆవు!
‘దేశంలో ఎవరైనా, ఎక్కడైనా నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించిన వాతావరణ సమాచారాన్ని తమ మొబైల్ ఫోన్‌లో చూసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా వారం రోజుల వాతావరణ సమాచారాన్ని, కొన్ని గంటల్లో వాతావరణం ఎలా మారబోతోందనే వివరాలను తెలుసుకోవచ్చు. ప్రాంతం పేరు, పిన్‌కోడ్, లేదా అక్షాంశ రేఖాంశాలను తెలిపి సమాచారం పొందవచ్చు. వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయడం మా ఉద్దేశం. పిడుగుపాటుపై హెచ్చరికల్ని ఇప్పుడు 1,200 నగరాలు, పట్టణాల్లో అందిస్తున్నాం. క్రీడలు, పారిశ్రామిక రంగాలు వాతావరణ సమాచారాన్ని తగిన స్థాయిలో వినియోగించుకోవడం లేదు. నిర్మాణపు పనులు, పెళ్లిళ్లు చేసేముందు కూడా ప్రజలు వాతావరణ వివరాలు వినియోగించుకోవాలి’ అని ఐఎండీ చీఫ్ కోరారు.