Minister Uttam Kumar Reddy: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌరసరఫరాల శాఖ విభాగం పై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వ పనులు, కాళేశ్వరం ప్యాకేజ్ 9 పెండింగ్, చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టు, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం, రామగుండం ఎత్తిపోతల పథకం, ఎల్లంపల్లి కెనాల్ నెట్ వర్క్ ప్యాకేజ్ 2 పనులు, ధాన్యం సేకరణ, కస్టం మిల్లింగ్ రైస్ డెలివరీ తదితర అంశాల పై మంత్రి ఉత్తమ్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు పండించారన్నారు. గతంలో ఎక్కడా లేని విధంగా సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందన్నారు. రైతులకు ఎక్కడా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులకు రికార్డు సమయంలో వడ్ల డబ్బులు పడ్తున్నాయన్నారు.
Read Also: Telangana: ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికి పెద్ద పీట.. నాణ్యమైన విద్యా బోధనకు చర్యలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ధాన్యం సేకరణ సంతృప్తికరంగా ఉందన్నారు. డిసెంబర్ 4న సీఎం పర్యటన ఉన్న సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే గంటల వ్యవధిలో రైతులకు మద్దతు ధర, బోనస్ చెల్లించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయానికి 100 శాతం ధాన్యం డబ్బులు చెల్లించి ఉండాలని ఆదేశించారు. సన్న రకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అధికంగా కొనుగోలు చేయాలని, ప్రైవేట్ వ్యాపారులు ఎక్కడ 2800 కంటే తక్కువ ధరతో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయకుండా చూడాలన్నారు. రాబోయే సంవత్సరంలో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ఇస్తున్నామని, దీనికి అనుగుణంగా కనీసం 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర గడిచిన నేపథ్యంలో డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తమ ప్రభుత్వం 10 నెలల కాలంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ ప్రైవేట్ సంస్థలో యువత ఉపాధి పొందేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పత్తిపాక రిజర్వాయర్ 2950 కోట్లతో 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు ప్రాథమిక అంచనాలు తయారు చేశామన్నారు. రామగుండం ఎత్తిపోతల పథకం 95 శాతం పూర్తయిందని, డిసెంబర్ నెలాఖరు వరకు పెండింగ్ పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నుంచి రైతులకు సాగు నీరు అందించాలని, పాలకుర్తి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలు, నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి కావాలన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు లోని ప్యాకేజ్ 9 పెండింగ్ పనులు, చిన్న కాళేశ్వరం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
Read Also: BJP Chargesheet: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్
సన్నాలకు బోనస్ తో రైతుల్లో ఆనందం: మంత్రి శ్రీధర్ బాబు
సన్న వడ్లకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అందించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అధికంగా లాభం చేకూరుతుందని, రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యతను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, 2 లక్షల రుణమాఫీ, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ పథకాల లబ్ధి పొందుతున్న రైతులతో వీడియోలు చేసి ప్రచారం చేయాలని , గ్రామాలలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలన్నారు. చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ త్వరగా చేపట్టాలన్నారు. దేవాదుల ప్రాజెక్టుగా సంబంధించి మరిన్ని అవుట్ లెట్ నిర్మాణం చేయాలన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మించడం వల్ల 2.4 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా మరో 15 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. పోతారం ఎత్తిపోతలకు పథకం, భీం ఘనపూర్ ఎత్తిపోతల పథకం పనుల ప్రతిపాదనలు అందజేయాలన్నారు.
నాణ్యమైన భోజనం అందేలా చూడాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలో కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులు సందర్శించి నాణ్యమైన భోజనం అందేలా చూడాలి. మెస్ చార్జీలను గ్రీన్ ఛానల్ ద్వారా అందిస్తున్నామన్నారు. ధాన్యం సేకరణ సజావుగా జరుగుతుందని, రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వ పాలసీ అనుసరిస్తూ సహకారం అందిస్తున్నారన్నారు. గౌరవెల్లి గండేపల్లి ప్రాజెక్టులను లింక్ చేసి సమాంతరంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి బండ్ నిర్మాణం చివరి దశలో ఉందని, కాలువల పనులకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని, భూ సేకరణ పై ఎటువంటి కోర్టు నిబంధనల లేనందున ముందుగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్య నారాయణ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పామెలా సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.