Telangana: దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందన్న ఆచార్య కొఠారి మాటలను ప్రజా ప్రభుత్వం ఆచరణలో చూపుతోంది.. నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ క్రమంలోనే విద్యా రంగంలో గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విప్లవాత్మకమైన చర్యలను చేపట్టింది. స్థానిక అవసరాలే కాకుండా ప్రపంచ అవసరాలను తీర్చే నైపుణ్యాలను తెలంగాణ బిడ్డలు ఒడిసిపట్టేలా సాంకేతిక విద్యకు కొత్త మెరుగులు దిద్దుతోంది..ఉపాధ్యాయులు పూర్తిగా బోధనపైనే దృష్టిపెట్టేలా వారి సమస్యలను పరిష్కరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యా శాఖను పర్యవేక్షిస్తూ రాష్ట్ర విద్యా రంగాన్ని సమున్నత స్థాయిలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. ఏడాది కాలంలోనే రాష్ట్ర విద్యా వ్యవస్థలో కనీవీని ఎరుగుని మార్పులు చోటు చేసుకున్నాయి… ప్రజా ప్రభుత్వం ఏడాది కాలంలో తీసుకున్న విప్లవాత్మక మార్పులను పరిశీలిస్తే….
* ఈ ఏడాది (2024-25) బడ్జెట్‌లో విద్యా శాఖకు రూ.21,292 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది గతేడాది బడ్జెట్ కన్నా రూ.2,119 కోట్లు ఎక్కువ. ఒక్క ఏడాదిలోనే రూ.2 వేల కోట్లకుపైగా అదనపు కేటాయింపులు ద్వారా విద్యా శాఖపై ఉన్న చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాటిచెప్పారు.
* ప్రతి ఏటా సమస్యలతోనే ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమవుతాయి. ప్రారంభ విఘ్నాలు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలలు తెరిచే నాటికి బల్లలు, కుర్చీలు, తలుపుల మరమ్మతులు.. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం, తరగతి గదుల విద్యుదీకరణ, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు జరిగింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లు ఖర్చు చేసింది. సంవత్సరాల తరబడి పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పాఠశాలల్లో పారిశుద్ధ నిర్వహణ, పచ్చదనం పెంపు.. మొక్కల సంరక్షణకు సింగరేణి కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద రూ.136 కోట్లు కేటాయించింది. దీంతో పాఠశాలల్లో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావారణం నెలకొంది.
Read Also: CM Revanth Reddy: రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
పాఠశాలలు తెరిచిన రోజే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు యూనిఫాంలు (ఏకరూప దుస్తులు), పాఠ్యపుస్తకాలను అందజేసింది. గతంలో దుస్తులు కట్టేందుకు రూ.50 ఇచ్చేవారు. దాంతో కూలీ గిట్టుబాటు కాక సరిగా దుస్తులు కుట్టేవారు కాదు.. రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.75కు పెంచడంతో ఈ దఫా యూనిఫాంల కుట్టు కుదిరింది. మహిళలకు ఆర్థికంగా చేయూత లభించింది. గతంలో ఏడాది మధ్యలోనో, ఆఖరులోనో పాఠ్య పుస్తకాలు ఇవ్వడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు.. ఈ ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందాయి. దాంతో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది.
ఎటువంటి చికాకులు, ఆందోళనలు లేకుంటేనే ఉపాధ్యాయులు బోధనపై దృష్టిపెట్టగలరు.. దానిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి.. ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా 21,419 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. జీవితకాలంలో ఒక్క ప్రమోషన్ లేకుండానే ఉద్యోగ జీవితం ముగిసిపోతుందనే ఆందోళనతో ఉన్న వేలాది మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పదోన్నతులు ఎంతో ఉపశమనం కలిగించాయి. రెట్టించిన ఉత్సాహంతో వారంతా బోధన చేస్తున్నారు. వేల సంఖ్యలో పదోన్నతులు కల్పించినా ఎక్కడా చిన్న పాటి విమర్శకు తావులేకుండా ఆన్‌లైన్‌లో, అత్యంత పారదర్శకంగా వివాదరహితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేసింది.
Read Also: BJP Chargesheet: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్
పది పదకొండేళ్లుగా ఒకే చోట పని చేస్తూ ఏళ్లుగా పలువురు ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూశారు.. తరగతులకు ఆటంకం కలగకుండా.. నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయులను బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. 37,406 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను, 2,757 మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. పాఠశాల భవనాలు ఎంత గొప్పగా ఉన్నా.. విద్యార్థులు ఎన్ని లక్షల మంది ఉన్నా తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించింది. వెంటనే ఫలితాలు ప్రకటించి అతి తక్కువ సమయంలోనే ఆ ఉపాధ్యాయుల నియామకాలను పూర్తి చేసింది.
ప్రభుత్వ బడుల్లో పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు ఉండరు… ఉపాధ్యాయులు ఉంటే పిల్లలు ఉండరనే విమర్శలున్నాయి. ఆ సమస్యను పరిష్కరించేందుకు పిల్లలు… టీచర్ల సంఖ్య మధ్య హేతబద్ధతను ప్రభుత్వం పాటించింది. ఒకటి నుంచి 10 మంది వరకు విద్యార్థులున్న పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు… 11 నుంచి 40 మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఇద్దరు ఉపాధ్యాయులు, 41 నుంచి 60 వరకు విద్యార్థులున్న పాఠశాలలకు ముగ్గురు ఉపాధ్యాయులను కేటాయించడంతో పాటు 60పైన విద్యార్థులున్న చోట ఆయా పాఠశాలలకు మంజూరైన పోస్టులన్నింటికి ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించింది. దీంతో ప్రతి పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన సాగుతోంది.
ఉమ్మడి రాష్ట్రంలో మొదలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో బీఎడ్ పూర్తి చేసిన వారు టెట్ రాయాలంటే ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారో.. ఎప్పుడు పరీక్ష పెడతారో తెలియని పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో డీఎస్సీకి ముందు టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. టెట్ రాసిన వారు డీఎస్సీ రాశారు.. ఇక నుంచి ఏటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.. దీంతో డీఎడ్, బీఎడ్ చదివే వారు నిశ్చింతగా తమ చదువులపై దృష్టిపెడుతున్నారు. పాఠశాల విద్యను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. పర్యవేక్షణ కొరవడడంతో పాఠశాల విద్యా రంగం దెబ్బతిన్నది. బాధ్యతాయుతమైన పర్యవేక్షణతోనే ప్రగతి ఉంటుందని భావించిన ప్రజా ప్రభుత్వం అన్ని మండలాలకు మండల విద్యాధికారులను నియమించింది.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వసతిగృహాలను వేర్వురు చోట్ల.. అద్దె గృహాల్లో…పురాతన భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటన్నింటిని ఒకే చోటకు చేర్చి 20 నుంచి 25 ఎకరాల్లో.. నూతన భవనాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న ఈ రెసిడెన్షియల్ పాఠశాలు తెలంగాణ బిడ్డల భవిష్యత్ కు బంగారు బాటలు వేయనున్నాయి.
2024, అక్టోబరు 11న కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ పాఠశాలల్లో అందే విద్యతో భవిష్యత్‌లో తెలంగాణ బిడ్డలు అత్యున్నత స్థానాల్లో కొలువుదీరనున్నారు.
Read Also: Eknath Shinde: మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని రేపు నిర్ణయిస్తారు.. షిండే కీలక వ్యాఖ్యలు..
నైపుణ్యాలకు పెద్దపీట….
మార్కెట్ అవసరాలకు పొంతన లేని చదువులతో సాధారణ డిగ్రీలతో పాటు ఇంజినీరింగ్ చేసిన వారు సైతం రూ.10 వేల కొలువు సాధించే పరిస్థితి లేకుండా పోయింది. ఆధునిక ప్రపంచ అవసరాలు, ప్రపంచంలోని పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ బిడ్డలకు నైపుణ్య విద్యను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. అందుకు అనుగుణంగా పురాతన కోర్సులు, సర్టిఫికెట్లకే పరిమితమైన రాష్ట్రంలోని 65 ఐటీఐలను రూ.2,106 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఐటీసీ) మార్చివేస్తున్నారు. అలాగే అకడమిక్ కోర్సులు.. పరిశ్రమల అవసరాల మధ్య అంతరాన్ని పూడ్చడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రజా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలు బోధించేలా ఈ స్కిల్ యూనివర్సిటీ ఉండాలని, సిలబస్ దానికి తగినట్లు రూపొందించాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విజయవంతంగా పరిశ్రమలు నడుపుతున్న ప్రముఖులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీలో భాగస్వాములను చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పలు దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. కానీ మన దేశంలో మాత్రం యువత ఎక్కువగా ఉంది. ఈ యువత ఆధునిక నైపుణ్యాలు నేర్చుకొని ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ఈ స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలను తీర్చిదిద్దుతున్నారు.
దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం (డ్రగ్స్) బాగా పెరిగిపోయింది. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి చేయిదాటిపోయింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా తెలంగాణలోనూ మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. ఈ ముప్పును తెలంగాణ బిడ్డలను రక్షించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపన పడుతున్నారు. అందుకోసమే పాఠశాలల్లోకి డ్రగ్స్ ప్రవేశించకుండా, మన బిడ్డలు వాటి బారిన పడకుండా ఉండేందుకు పాఠశాల స్థాయిలో ప్రహరి క్లబ్‌లను ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రభుత్వ వసతి గృహాల్లో బిడ్డలకు కడుపు నిండా నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం డైట్ ఛార్జీలను పెంచింది. పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న ఈ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.300 కోట్లకుపైగా అదనపు భారం పడుతున్నా ప్రభుత్వం వెనుకంజ వేయలేదు. ప్రభుత్వం డైట్ ఛార్జీల పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వసతిగృహాల్లోని 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. డైట్ ఛార్జీలతో పాటు విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.
విశ్వ విద్యాలయాలను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. విశ్వ విద్యాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వీలుగా సమర్థులైన వారిని విశ్వ విద్యాలయాలకు ఛాన్సలర్లుగా ప్రజా ప్రభుత్వం నియమించింది. వీసీల నియామకంలో రాజకీయాల ప్రమేయం లేకుండా, లాబీయింగ్‌కు అవకాశం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరించింది. విశ్వ విద్యాలయాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది శాశ్వత నియామకానికి ప్రభుత్వం యోచిస్తోంది.
* విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా….
* ట్రాఫిక్ నియంత్రణ, మహిళా భద్రత, రహస్య కెమెరాల పర్యవేక్షణ కోసం ఎన్ఎస్ఎస్ విద్యార్థుల కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది.
* సాంకేతిక విద్యా విభాగంలో 24 లైబ్రేరియన్ పోస్టుల భర్తీ జరిగింది
* 247 లెక్చరర్ పోస్టులకు సంబంధించి సాధారణ మెరిట్ లిస్టు విడుదల
* 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహణ పూర్తి
* ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి EASY యాప్ సర్వీస్ అభివృద్ధి చేయడమైనది.