NTV Telugu Site icon

Sumanth Reddy: భార్య దాష్టికానికి డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి

Doctor

Doctor

Sumanth Reddy: వరంగల్‌లో జరిగిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ సుమంత్ రెడ్డి తన ప్రాణాలను కోల్పోయిన విషాదకర ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల 20వ తేదీన బట్టుపల్లి సమీపంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి వ్యవహారంలో ఆయన భార్య ఫ్లోరా ప్రధాన ముద్దాయి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో కోలుకునే అవకాశమే లేదని వైద్యులు తెలిపారు. దాంతో, కుటుంబ సభ్యులు ఆయనను తిరిగి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఒక రోజు చికిత్స పొందిన అనంతరం ఈరోజు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.

Read Also: IIT Baba: ఐఐటీ బాబాపై దాడి.. టీవీ డిబేట్‌లో తనను కొట్టారని ఆరోపణ..

ఈ కేసులో నిందితులైన డాక్టర్ సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా, ఆమె ప్రియుడు సామెల్, అలాగే సామెల్ స్నేహితుడు, ఏఆర్ కానిస్టేబుల్ అయిన రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి సూత్రధారులు ఫ్లోరా, సామెల్ అని పోలీసులు నిర్ధారించారు. ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డాక్టర్ సుమంత్ రెడ్డి మృతదేహాన్ని మార్చురీలోకి తరలించిన వైద్యులు, ఈరోజు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అనంతరం ఆయన అంత్యక్రియలు కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఘటన కుటుంబ కలహాల కారణంగా చోటుచేసుకుందా? లేక మరేదైనా కారణముందా? అనే కోణంలో పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనను స్థానికంగా తీవ్రంగా ఖండిస్తున్నారు.