ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరగనుంది. శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య పండు వెన్నెలలో రాముల వారి కళ్యాణం వైభవంగా జరగనుంది. సీతారాముల కల్యాణోత్సవానికి వైఎస్సార్ జిల్లా యంత్రాగం, టీటీడీ కలిసి సర్వం సిద్ధం చేశాయి. భక్తులకు పంపిణీ చేయడానికి లక్ష ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను టీటీడీ సిద్ధం చేసింది. సీతారాముల కల్యాణాన్ని లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.
సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు ఒంటిమిట్ట చేరుకుని.. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేస్తారు. అనంతరం కల్యాణ వేదికలో సాయంత్రం 5.30 నుంచి వేదపండితుల సమక్షంలో నిర్వహించే సీతారాముల కల్యాణాన్ని తిలకిస్తారు. సీఎం ఈరోజు రాత్రికి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు. 12వ తేదీన తిరిగి కడప ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడకు సీఎం చంద్రబాబు బయలుదేరి వెళతారు.
శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం కోసం 52 ఎకరాల విస్తీర్ణంలో కల్యాణ వేదికను నిర్మించారు. కల్యాణ వేదికకు ఎదురుగా రెండు వైపులా భక్తులు కూర్చోవడానికి 147 గ్యాలరీలు సిద్ధం చేశారు. 13 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను సైతం అమర్చారు. ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, సీవీఎస్‌వో హర్షవర్ధన్‌రాజు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.