Vivek Resigns From BJP: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇదే సమయంలో పార్టీల్లో జంపింగ్ నేతల జోరు కొనసాగుతోంది.. అధికార పక్షం నుంచి ప్రతిపక్ష పార్టీల్లోకి ప్రతిపక్షాల నుంచి అధికార పక్షంలోకి నేతలు చేరుతూనే ఉన్నారు. సాధారణ లీడర్లు పార్టీలు మారితే.. సీట్ల ఎంపికలో తేడా కొట్టొచ్చు.. కానీ, కీలక బాధ్యతల్లో ఉన్న నేతలే పార్టీకి గుడ్‌బై చెబితే పరిస్థితి మరోలా ఉంటుంది.. ఇప్పుడు ఆ పరిస్థితి తెలంగాణ బీజేపీకి వచ్చింది.. ఎందుకంటే.. ఎన్నికల సమరంలో దూసుకుపోతున్న వేళ.. ఇప్పటికే అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలు కొన్ని ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించాయి.. తామ హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.. ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నాయి.. ఇలాంటి కీలక సమయంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎంపీ వివేక వెంకటస్వామి పార్టీకి రాజీనామా చేశారు. దీంతో.. బీజేపీకి గట్టి షాక్ తగిలినట్టు అయ్యింది.
బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా ఉన్న వెంకటస్వామి.. పార్టీ మార్పుపై ఎప్పటి నుంచో ప్రచారం సాగుతూనే ఉంది.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్తున్నా.. బీఎస్పీ లాంటి పార్టీలు కూడా మేనిఫెస్టోలు ప్రకటించినా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే.. కింగ్ మేకర్స్ కాదు.. మేమే కింగ్‌లం అంటూ ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలు ఇప్పటికీ మేనెఫెస్టో తీసుకురాలేకపోయారు.. ఇప్పటి వరకు వివేక్ నేతృత్వంలో మేనిఫెస్టోపై ఏదైనా కసరత్తు జరిగినా.. ఆయనే పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్టు అయ్యింది.. తెలంగాణలో అసలైన ప్రత్యామ్నాయం తామే అంటున్న బీఆర్ఎస్.. ఎప్పుడు మేనిఫెస్టోపై కసరత్తు ప్రారంభించి.. ఇంకా ఎప్పుడు మేనిఫెస్టో తీసుకు వస్తుంది అనేది ప్రశ్నగా మారింది.
కాగా, ఎన్నికల వేళ బీజేపీలో వివేక్ రూపంలో మరో వికెట్ పడింది.. తాజాగా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఆయన బాటలోనే ఇప్పుడు హస్తం పార్టీ గూటికి చేరారు వివేక్.. 2009లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన వివేక్ రాష్ట్ర విభజన తర్వాత టీఆర్‌ఎస్ లో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీలో తగిన ప్రాధాన్యత లేదంటూ బీజేపీలో చేరారు.. ఇప్పుడు బీజేపీకి గుడ్‌బై చెప్పి.. తన నాన్న జి. వెంకటస్వామి సుదీర్ఘకాలం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.. బాధాతప్త హృదయంతో బీజేపీ రాజీనామా చేస్తున్నట్లు.. పార్టీలో తనకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.. బీజేపీ తెలంగాణ అధ‌్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖకు పంపారు వివేక్. బీజేపీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతూ వచ్చినా.. ఆ వార్తలను ఖండిస్తూ వచ్చిన వివేక్.. చివరకు ఆ వార్తలనే నిజం చేశారు.