టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబె సేవల్ని గత కెప్టెన్ల కంటే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాగా ఉపయోగించుకుంటున్నాడని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. దూబెలోని బౌలర్‌ను సూర్య చక్కగా ఉపయోగించుకోవడం వల్లే దాయాది పాకిస్థాన్‌పై విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు బాగా బౌలింగ్ చేస్తున్నారని వీరూ ప్రశంసించాడు. ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. దూబె 4 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు.
Also Read: PAK vs SL: మెరిసిన షాహీన్ అఫ్రిది.. పాకిస్థాన్ ముందు స్వల్ప లక్ష్యం!
మ్యాచ్ అనంతరం వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ… ‘గత కెప్టెన్లు శివమ్ దూబె సేవల్ని సమర్థంగా వినియోగించుకోలేదు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం అతడిని మంచి బౌలర్‌గా చూస్తున్నాడు. పిచ్ కూడా దూబెకు అనుకూలంగా ఉంది. పిచ్‌లో వేగం లేదు కాబట్టి కట్టర్స్, స్లో బాల్స్ వేస్తే బ్యాటర్లకు షాట్లు ఆడటం కష్టం. బంతి వేగంగా దూసుకురానప్పుడు బ్యాటర్లు గట్టిగా బాదాల్సి ఉంటుంది. పాక్ బ్యాటర్లు ఇక్కడే పొరపాట్లు చేశారు. దూబె రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మరో ఎండ్ నుంచి వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. 6 ఓవర్లలో పాకిస్థాన్ 30 పరుగులు మాత్రమే చేసింది. అప్పుడే మ్యాచ్ భారత్ వైపు తిరిగింది’ అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
