Virat Kohli will play ODI World Cup 2027: టీ20, టెస్ట్ ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అయిన తర్వాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు పూర్తిగా వన్డేలపై దృష్టి సారించాడు. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన వన్డే సిరీస్ వాయిదా పడడంతో.. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో విరాట్ ఆడనున్నాడు. ఈ సిరీస్ విరాట్ కెరీర్‌కు చివరిది కావచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే తనలో ఇంకా ఆడే సత్తా ఇంకొన్నేళ్లు ఉందని కింగ్ ఓ పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పాడు. కోహ్లీ తాజాగా నెట్ సెషన్‌కు సంబందించిన ఓ ఫొటో షేర్ చేశాడు. ఆ ఫోటో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎప్పుడెప్పుడు తిరిగి రావాలనే అతని ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది.
విరాట్ కోహ్లీ చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాడు. ఆపై ఐపీఎల్ 2025 ఆడాడు. టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్ ఆడలేదు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ వాయిదా పడింది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో కింగ్ బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్ కోసం విరాట్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టాడు. ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో కోహ్లీతో పాటు గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ నయీమ్ అమీన్ ఉన్నాడు. ‘నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు సోదరా. నిన్ను చూడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది’ అని పేర్కొన్నాడు.
Also Read: Sara Tendulkar: తండ్రి బాటలోనే సారా.. త్వరలోనే రిలేషన్‌షిప్‌పై అధికారిక ప్రకటన!
త్వరలో వన్డేలకు సైతం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తాడని, అతడి భవిష్యత్ గురించి బీసీసీఐ మాట్లాడనుందని ఇటీవల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్‌లో అతడికి చివరికి అని కూడా అంటున్నారు. ఈ న్యూస్ మధ్య విరాట్ మైదానంలో శ్రమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల ముందే కింగ్ సన్నద్ధమవుతున్నాడని, ఇది అతడి డెడికేషన్ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ అప్పుడే రిటైర్మెంట్ ఇవ్వడని, 2027 వన్డే ప్రపంచకప్ ఆడుతాడని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.