Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు. నవంబర్ 4 నుండి న్యూజిలాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కోహ్లీ పరుగుల వరద పారిస్తే సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. అదేంటంటే.. SENA దేశాలైన సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో వన్డే క్రికెట్‌లో 50కి పైగా సగటు నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచే ఛాన్స్ కోహ్లీకి ఉంది.
వన్డేల్లో సౌతాఫ్రికా గడ్డపై విరాట్ కోహ్లీ 76.38 సగటుతో పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌లో అతడి సగటు 51.48గా ఉంది. అలాగే ఆస్ట్రేలియాలో 50.03గా ఉండగా న్యూజిలాండ్‌లో మాత్రం కోహ్లీ సగటు ప్రస్తుతం 49.66గా ఉంది. దీంతో రాబోయే ఐదు వన్డేల సిరీస్‌లో ఈ సగటును 50కి పైగా తీసుకెళ్తే ఈ అరుదైన ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా కోహ్లీ రికార్డ్ సాధిస్తాడు. అయితే న్యూజిలాండ్‌లో తన వన్డే సగటును 50కి పైగా తీసుకెళ్లేందుకు కోహ్లీ ముందు పలు అవకాశాలు ఉన్నాయి. ఐదు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ చేసి ఐదుసార్లు ఔటైతే సిరీస్‌లో మొత్తం 254 పరుగులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు న్యూజిలాండ్‌లో అతడి వన్డే సగటు 50+ మార్కును చేరుకుంటుంది.
ఒకవేళ 5 మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు మాత్రమే ఔటై, ఒకసారి నాటౌట్‌గా నిలిస్తే మొత్తం 204 పరుగులు చేస్తే సరిపోతుంది. అలాగే మూడు మ్యాచ్‌ల్లో ఔటై, రెండుసార్లు నాటౌట్‌గా నిలిస్తే 154 పరుగులు చేసినా న్యూజిలాండ్ గడ్డపై అతడి వన్డే సగటు 50కి పైగా చేరుతుంది. తద్వారా SENA దేశాలన్నింటిలోనూ 50కి పైగా వన్డే సగటు కలిగిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుంది. వన్డే క్రికెట్‌లో ఇప్పటికే 15 వేలకుపైగా పరుగులు సాధించిన కోహ్లీ కెరీర్ సగటు 58.79గా ఉంది. 94.37 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన అతడి ఖాతాలో 55 సెంచరీలు, 79 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ తనదైన ముద్ర వేస్తే కోహ్లీ ఖాతాలో మరో అరుదైన ప్రపంచ రికార్డు చేరనుంది. చూడాలి మరి కోహ్లీ ఈ గోల్డెన్ ఛాన్స్ ను అందిపుచ్చుకుంటాడో లేదో మరి..! న్యూజిలాండ్ సిరీస్ ఈ నెల 22 నుండి మొదట 5 టీ20 లతో ఆరంభం కానుంది.

