Lineman Restores Power in Middle of Lake in Siddipet: గత 5-6 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలకు చాలా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకం కలుగుతోంది. చాలా చోట్ల చెట్లు నేలకొరగడం, భారీ గాలులకు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా.. విద్యుత్ అంతరాయం కలగకుండా సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. చెట్లు, స్తంభాలు నేలకొరగడంతో వైర్లు తెగిపడినా.. గంటల్లో బాగు చేస్తున్నారు.
తాజాగా సిద్దిపేటలోని నాగసముద్రాల గ్రామం (బత్తులవానిపల్లి)లో విద్యుత్ సరఫరాకు కలిగింది. లైన్‌మెన్ హైముద్దీన్ నాగసముద్రం చెరువు మధ్యలో లైన్ తెగిపోవడం గుర్తించాడు. విద్యుత్ పునరుద్ధరించేందుకు హైముద్దీన్ పెద్ద సాహసం చేశారు. తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి.. స్తంభం ఎక్కి మరీ కనెక్షన్ ఇచ్చారు. దాంతో నాగసముద్రాల గ్రామంలో వెలుగులు విరజిమ్మాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లైన్‌మెన్ హైముద్దీన్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హైముద్దీన్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: TSRTC Record: రాఖీ పౌర్ణమికి రికార్డు ప్రయాణాలు.. టీఎస్ఆర్టిసీ చరిత్రలో ఇదే తొలిసారి!
లైన్‌మెన్ హైముద్దీన్ సాహసంను దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. నాగసముద్రం చెరువు, బత్తులవానిపల్లి (బస్వాపూర్ సెక్షన్, సిద్దిపేట సర్కిల్) మధ్యలో తెగిపోయిన లైన్‌ను పునరుద్ధరించడం జరిగింది అని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను ట్యాగ్ చేశారు. టీజీఎస్పీడీసీఎల్ ట్వీట్‌పై డిప్యూటీ సీఎం స్పందించారు. ‘జోరు వానలో సైతం విద్యుత్తును పునరుద్ధరించడానికి ధైర్యంగా పనిచేసిన సిద్దిపేటకు చెందిన మన లైన్‌మ్యాన్ హైముద్దీన్ గారిని చూసి గర్వంగా ఉంది. మీ ధైర్యం తెలంగాణ ఇంధన శాఖ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. మనం అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.
Proud of our lineman, Haimuddin garu from Siddipet, who braved floodwaters to restore power.
Your courage reflects the spirit of Telangana’s Energy Department.
While we serve the people with dedication, we must always keep safety first. https://t.co/6AqaKBYPEA— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) August 13, 2025