NTV Telugu Site icon

Vinod Kambli: మళ్లీ క్షీణించిన మాజీ క్రికెటర్ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స

Vinod Kambli

Vinod Kambli

భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో.. ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కాంబ్లీ రమాకాంత్ అచ్రేకర్ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌ను కూడా కలిశాడు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాంబ్లీ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనకు గుండె సంబంధిత సమస్యలతో పాటు అనేక ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడు. ఇంతకుముందు కూడా ఆయన ఆరోగ్యం క్షీణించింది. తాజాగా.. మరోసారి క్షీణించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. కాంబ్లీ.. ఇటీవల పునరావాస కేంద్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మాజీ క్రికెటర్లు కూడా కాంబ్లీకి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కపిల్ దేవ్ నుండి సునీల్ గవాస్కర్ వరకు అతనికి సహాయం చేయడం గురించి మాట్లాడారు.

Read Also: Delhi: విద్యార్థులకు షాక్.. నో డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేసిన కేంద్రం

అంతర్జాతీయ క్రికెట్‌లో కాంబ్లీ 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అతను 21 ఇన్నింగ్స్‌లలో 54.20 సగటుతో, 59.46 స్ట్రైక్ రేట్‌తో 1084 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధ సెంచరీలు, 4 సెంచరీలు సాధించాడు. టెస్టులో అతని అత్యధిక స్కోరు 227 పరుగులు. జనవరి 1993లో ఇంగ్లండ్‌పై కాంబ్లీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అక్టోబర్ 1991లో పాకిస్థాన్‌పై కాంబ్లీ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 105 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 97 ఇన్నింగ్స్‌లలో 2477 పరుగులు చేశాడు. వన్డేల్లో కాంబ్లీ సగటు 32.59, స్ట్రైక్ రేట్ 71.94. ఈ ఫార్మాట్‌లో 14 అర్ధసెంచరీలతో పాటు 2 సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 106 పరుగులు.

Read Also: Shikha Goyal: సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2024 వార్షిక నివేదిక విడుదల