Kesineni Nani: తిరువూరులో టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో జరిగిన వివాదంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కేశినేని చిన్ని ఎవరు ?.. చిన్ని ఎంపీనా, ఎమ్మెల్యేనా ? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయనే తాను సభలకు దూరంగా ఉంటున్నానని ఎంపీ తెలిపారు. అందుకే తాను యువగళంకి వెళ్ళలేదని ఆయన చెప్పారు. చంద్రబాబును పట్టించుకోలేదు అంటున్నారని.. కానీ చాలా వరకు ఓపికగా ఉంటున్నానని కేశినేని నాని పేర్కొన్నారు. కేవలం చంద్రబాబు కోసం, పార్టీ తిరిగి అధికారంలోకి రావడం కోసమే అలా ఓపికగా ఉంటున్నానని ఎంపీ స్పష్టం చేశారు. ఎన్నో అవమానాలు కూడా పడుతున్నానన్నారు.
Read Also: YS Sharmila met Jagan: అరగంట పాటు జగన్, భారతితో షర్మిల మాటామంతి
విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. “విజయవాడలో ఒక క్యారెక్టర్ లెస్ ఫెలో ప్రెస్ మీట్ పెట్టీ నన్ను చెప్పుతో కొడతా అన్నాడు. పొలిట్ బ్యూరో సభ్యుడు గొట్టం గాడు అన్నాడు. 50 సీట్లలో 30 సీట్లు గెలిచి దక్కే బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ను చెడగొట్టారు. అమ్ముడుపోయి మేయర్ వచ్చేదాన్ని చెడగొట్టారు. ఏడాదిగా రగులుతున్న కుంపటి ఇది. నేను ఊరుకున్నా కూడా ప్రజలు ఊరుకోరు. విజయవాడ కోసం పనిచేసిన నాపై అభిమానం ప్రజలకు ఉంటుంది. వారికి కోపం వస్తే ఇలానే తిరగబడతారు. ఏడాదిగా జరుగుతున్న వ్యవహారానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలిగా. తిరువూరు ఇంఛార్జి శ్యామ్ దత్ రాజకీయాలకు పనికిరాడు. అభ్యర్థిగా సరిపోడు ఇదే విషయం చంద్రబాబుకి చెప్పాను. సరైన సమయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. తిరువూరు సభ సక్సెస్ చేసే బాధ్యత నాది. సిట్టింగ్ ఎంపీ సభా ఏర్పాట్లను పరివేక్షణ చేయరు అని అధికారిక ప్రకటన పార్టీ నుంచి వచ్చిందా లేదుగా?. సిట్టింగ్ ఎంపీగా నాకు ఈ పని చేయాలని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు.” అని కేశినేని నాని పేర్కొన్నారు.
