విజయవాడలో రిటైర్డ్ ఇంజినీర్‌ను దారుణంగా హత్య చేశారు. ఇంట్లో పని మనిషే మాటు వేసి చంపేసింది. వృద్ధులు ఉన్నారని ప్లాన్ చేసి మరీ హత్య చేసింది. బంగారం, డబ్బుతో ఉడాయించింది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ హత్య బెజవాడలో కలకలం సృష్టిస్తోంది.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వెంకట రామారావు. రోడ్లు భవనాల శాఖలో ఇంజినీర్‌గా పని చేసి రిటైరయ్యారు. ప్రస్తుతం విజయవాడ NTR కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈయనతో పాటు ఆ ఇంట్లో తల్లి కూడా ఉంటోంది. ఇద్దరూ వృద్ధులే కావడంతో ఇంటి పనులు చేసుకోవడం కోసం ఓ కేర్ టేకర్‌ను 3 రోజుల క్రితం నియమించుకున్నారు. అదే వారు చేసిన తప్పయింది.
ఈ ఫోటోలో ఉన్న కిలాడీ లేడీ పేరు అనూష. స్వస్థలం గుంటూరు జిల్లా నులకపేట. 3 రోజుల క్రితమే వెంకట రామారావు ఇంట్లో పనికి కుదిరింది. కానీ జస్ట్ మూడు రోజుల్లోనే తన బుద్ధి చూపించింది. ఏకంగా యజమాని వెంకటరామారావును హత్య చేసి బంగారు నగలు, డబ్బుతో పారిపోయింది. నిజానికి ఈ నెల 10న తమ బంధువులు చనిపోయారని చెప్పి ఉదయం వెళ్లిపోయింది అనూష. కానీ రాత్రి 8 గంటలకు వెంకట రామారావు ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో రాత్రి భోజనం అయ్యాక వెంకట రామారావు తల్లి సరస్వతి గదిలో నిద్రించింది. అంటే నిద్రపోయింది అనే కంటే నిద్రపోయినట్టు నటించిందని చెప్పవచ్చు. కాసేపటికే వృద్ధురాలు సరస్వతి గది నుంచి బయటకు వచ్చిన అనూష.. హాలులో పడుకుంది. ఈ క్రమంలో చూసిన సరస్వత ఇక్కడ పడుకున్నావేంటని అడిగింది. ఐతే గదిలో గాలి ఆడడం లేదని బుకాయించింది.
ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన ప్లాన్ అమలు చేసింది అనూష. సరస్వతి గదిలో తప్ప మిగతా అన్ని గదుల్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నిద్ర లేచిన సరస్వతి.. తన కుమారుని గదికి వెళ్లింది. అక్కడ రామారావు మంచంపై పడి ఉన్నాడు. శరీరం కూడా చల్లబడి ఉంది. ఇంట్లో ఉండాల్సిన అనూష కూడా కనిపించలేదు. దీంతో అనుమానం కలిగిన సరస్వతి స్థానికులకు సమాచారం ఇచ్చింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామారావు కంట్లో కారం కొట్టి దిండుతో అదిమి హత్య చేసినట్టుగా గుర్తించారు. ఇంట్లో బీరువా మొత్తం కూడా చెల్లాచెదురుగా ఉంది. అనూష మూడు రోజుల క్రితమే పనులు చేరినట్టుగా పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీలను పరిశీలించగా అనూషతో పాటు ఆమె భర్త మరో వ్యక్తి వచ్చినట్టుగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. హత్య తర్వాత అనూష అండ్ గ్యాంగ్ పరారయ్యారు.
ఐతే ఇంట్లో ఎంత మొత్తం చోరీకి గురైంది అనే అంశాలను పోలీసులు విచారిస్తున్నారు. రామారావు కుమార్తె కుమారుడు హైదరాబాద్ నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఇంట్లో పని చేసేందుకు నమ్మకంగా జీతానికి పెట్టుకున్న పని మనిషే ఇంతటి దారుణానికి పాల్పడడంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇద్దరు వృద్ధులు ఏం చేయలేరనే అనూష ఇంతటి దారుణానికి తెగబడి ఉంటుందని చెబుతున్నారు. ఆమెను, ఆమెకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.