గత 44 ఏళ్ళుగా బీజేపీ పని చేస్తోందని, 45వ పుట్టిన రోజు జరుపుకుంటోంది బీజేపీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. జనసంఘ్‌ను శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రారంభించారని తెలిపారు. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే.. జనసంఘ్ రద్దు చేసి.. జనతా పార్టీని ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. 1980 ఏప్రిల్ 6 న జనతావపార్టీ నుంచీ బయటకి వచ్చి స్వతంత్రంగా బిజెపి ఏర్పడిందని, బీజేపీ మిగిలిన పార్టీలతో కలిసి వాజ్ పేయి నేతృత్వంలో పాలన జరిపిందన్నారు సూర్యనారాయణ రాజు. నరేంద్ర మోడీ నాయకత్వంలో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేసారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని, జగన్మోహన్ రెడ్డి మాట తప్పి, మడమ తప్పి మోసం చేశారని సూర్యనారాయణ రాజు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించి… నిరసన తెలిపితే అరెస్టు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. పేదల బియ్యం దోచుకుని విదేశాలకు తరలిస్తున్నారని, వైసీపీ నాయకులు అటవీ శాఖ భూములను దోచుకున్నారని ఆరోపించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు.