Site icon NTV Telugu

Aadi Srinivas : అభివృద్ధిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.. అందుకే..

Aadi Srinivas

Aadi Srinivas

Aadi Srinivas : ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ పట్టణంలో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ముందుకొస్తే, కొన్ని రాజకీయ పార్టీలు మళ్లీ అడ్డుపడుతున్నాయన్న ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.76 కోట్లు మంజూరయ్యాయని, ఇది పట్టణానికి , ఆలయానికి మరింత ఆకర్షణను తీసుకురావడమే కాక, భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాస్ తెలిపారు.

బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు అభివృద్ధిని జీర్ణించుకోలేక బంద్‌కు పిలుపునిచ్చాయని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నా ఒక్క రూపాయి కూడా కేటాయించని బీఆర్ఎస్ నేత కేసీఆర్, కేంద్రంలో మూడు సార్లు అధికారంలోకి వచ్చి ఏ మద్దతు చూపని బీజేపీ నేతలు ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటే బాధాకరమని అన్నారు. పుణ్యక్షేత్ర అభివృద్ధిలో భాగంగా ఆలయంలో జరిగే అన్ని నిత్య పూజలు యథావిధిగా జరుగుతాయని పదేపదే చెబుతున్నామని పేర్కొన్నారు. దేవాలయం తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని, భక్తుల సేవలలో అంతరాయం కలుగకుండా మండప విస్తరణ పనులు చేపడుతున్నామని వివరించారు.

CPI Narayana: కేంద్ర నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలం..! ఆ ఉగ్రవాదులను అప్పగించాకే పాక్‌తో చర్చలు జరపాలి..!

శృంగేరి పీఠాధిపతుల సలహాల మేరకు మార్గనిర్దేశనతో భీమేశ్వరాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఇది రాజన్నకు భక్తి లోపించకుండా చేయడానికే అని స్పష్టీకరించారు. మహా మండపాన్ని తొలగిస్తామని ఎవరూ చెప్పలేదని, అలాంటి మార్పులకు మేము కూడా వ్యతిరేకమేనని శ్రీనివాస్ స్పష్టం చేశారు. 2024-25 బడ్జెట్‌లో రూ.50 కోట్లు, 2025-26లో మరో రూ.100 కోట్లు కేటాయించి మొత్తం రూ.150 కోట్లతో ఆలయ , పట్టణ అభివృద్ధిని VTDA ద్వారా చేపట్టనున్నామని చెప్పారు.

“ఇది ఎవరి ఇల్లు కాదు. ఇది దక్షిణ కాశీగా పేరుగాంచిన పరమశివుని నిలయం,” అని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధిని స్వాగతించకుండా అడ్డుపడడం అనేది రాజకీయాలకు మాత్రమే సంబంధించిన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రతి విషయాన్నీ భక్తుల కోణంలో పరిగణిస్తూ ముందడుగు వేస్తుందనీ, రాజకీయాలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ఆలయాభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Cyberabad Police: ఆదమరిస్తే అంతే సంగతులు.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

Exit mobile version