Veera Raghava Reddy: రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించాడు. మూడు రోజులుగా కొనసాగుతున్న విచారణలో ఆయన తన చర్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. రంగరాజన్‌పై దాడి చేయడం తప్పే అని అంగీకరించిన వీర రాఘవరెడ్డి, ఆ సంఘటనకు కారణాలను వివరించాడు. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వీర రాఘవరెడ్డి తన చర్యను సమర్థించుకోలేనని, ఇకపై శాంతియుతంగా రామరాజ్య స్థాపన కోసం పనిచేస్తానని చెప్పాడు. తన వెంట వచ్చిన అనుచరుల ముందు తనను చిన్నచూపు చూశారని, ఆ ఒత్తిడిలోనే దాడికి దిగాల్సి వచ్చిందని వెల్లడించాడు.
Read Also: Trump vs INDIA: భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే అమెరికా నష్టపోతుంది..
పోలీసులు రామరాజ్యాన్ని ఎందుకు స్థాపించాలనుకున్నావని ప్రశ్నించగా, ఆయన 2015లో జరిగిన ఓ ఘటనను ఉదహరించాడు. తన రెండో తరగతి చదువుతున్న బిడ్డను మూడో తరగతికి ప్రమోట్ చేయకుండా డీటైన్ చేశారని.. అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని వివరించాడు. ఈ అన్యాయాన్ని చూసి సమాజాన్ని మార్చాలని, రామరాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తాను పదో తరగతి వరకు మాత్రమే చదివినా.. చట్టాలపై, మత గ్రంథాలపై విస్తృతంగా అవగాహన పెంచుకున్నానని వీర రాఘవరెడ్డి పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. నేటితో వీర రాఘవరెడ్డి కస్టడీ ముగియనుండడంతో పోలీసులు మరింత లోతుగా విచారించనున్నారు. ఈ కేసులో మరెవరెవరికి ప్రమేయం ఉందో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.