Vaibhav Sooryavanshi: ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేయకపోవడం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ బ్యాటర్.. బెల్‌ఫాస్ట్‌లో జరిగే తొలి మ్యాచ్‌లోనే బరిలోకి దిగుతాడని భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్లారిటీ ఇస్తూ.. వైభవ్ తుది జట్టులో లేడని స్పష్టం చేయడంతో ఈ సిరీస్ ఓపెనర్ కంటే సూర్యవంశీ వైఫల్యంపైనే ఎక్కువ చర్చ నడిచింది. ఒకరికి అవకాశం ఇవ్వడం కోసం ఇప్పటికే జట్టులో స్థిరంగా రాణిస్తున్న ఆటగాడిని పక్కనబెట్టడం సరైన పద్ధతి కాదని, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడానికి, సీనియర్ల పట్ల అన్యాయంగా ప్రవర్తించడానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుందని మ్యాచ్‌కు ముందు రోజు భారత బ్యాటింగ్ కోచ్ శితాంశు కోటక్ అభిప్రాయపడ్డారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా టాస్ వేదికగా ఇదే విషయాన్ని సమర్థిస్తూ, వైభవ్ అద్భుతమైన ఆటగాడే అయినప్పటికీ.. గత కొన్ని సిరీస్‌లుగా అద్భుతంగా రాణిస్తున్న సీనియర్ల అనుభవానికే తాము మొగ్గు చూపామని చెప్పాడు. ఇక నిన్నటి మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో టీమిండియా జట్టు ఎంపికపై ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో బలమైన భారత్‌పై ఐర్లాండ్ చారిత్రాత్మక విజయం సాధించింది. గాయాలతో సతమతమవుతున్న ఐర్లాండ్ జట్టు, ఏకంగా ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును ఐర్లాండ్ బౌలర్లు కట్టడి చేశారు. భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమి తరువాత జట్టులో వైభవ్ ఉండి ఉంటే ఈ మ్యాచ్‌ను పక్కా గెలిపించేవాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. బుడ్డోడికి అవకాశం ఇవ్వకపోవడం పెద్ద తప్పిదమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇక, అభిమానులు మేనేజ్‌మెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక యూజర్ అయితే ఏకంగా మ్యాచ్‌ను బహిష్కరించాలని (Boycott) పిలుపునిస్తూ.. “అందరూ వైభవ్ అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు.. తిలక్ వర్మ లాంటి వారికి అవకాశాలిస్తూ వైభవ్ లాంటి టాలెంట్‌ను పక్కనబెట్టడం శ్రేయాస్ అయ్యర్ తీసుకున్న అత్యంత దారుణమైన నిర్ణయం” అంటూ ఘాటుగా స్పందించారు. అభిమానుల ఆగ్రహమే కాకుండా, మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. “ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 ఆటగాడైన వైభవ్ సూర్యవంశీని భారత్ తుది జట్టులోకి తీసుకోకపోవడాన్ని నమ్మలేకపోతున్నాను” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు. అయితే దీనికి కౌంటర్ ఇస్తూ కొందరు మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని సమర్థించారు. “ఇది లోకల్ లీగ్ ప్రదర్శనల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసే పాకిస్థాన్ కాదు.. ఇక్కడ కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తేనే జట్టులో అవకాశం దక్కుతుంది” అని వాన్‌కు బదులిచ్చారు.

