Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూశారా?

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: వైభవ్ ఇప్పుడు తన పర్ఫామెన్స్‌తో ప్రపంచ క్రికెట్‌ను అబ్బురపరిచాడు. గత మ్యాచ్ వివాదాలు, విమర్శలకు తన బ్యాట్‌తోనే కాదు.. అంతకంటే ముందే తన మైండ్ గేమ్‌తో సమాధానమిచ్చాడు 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ‘ఎ’ చేతిలో సూపర్ ఓవర్ ఓటమి, ఆపై మైదానంలో జరిగిన ఘర్షణ వైభవ్ చాలా డిస్ట్రబ్ అయ్యాడు. అప్పటి నుంచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయిన ఈ ‘బేబీ బాస్’.. శ్రీలంక బౌలర్లు చుక్కలు చూయించాడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే వైభవ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్టోరీలో వైభవ్ తన ఫొటోని పోస్ట్ చేస్తూ క్యాప్షన్‌లో “100” అని రాశాడు. ఈ స్టోరీతో లంక జట్టుకు గట్టి హెచ్చరిక పంపాడు. అనుకున్నట్లుగానే ఫైనల్లో సెంచరీ మార్కును అందుకోలేకపోయినా.. కేవలం 29 బంతుల్లో 94 పరుగులతో లంక బౌలర్ల గుండెల్లో వణుకు పుట్టించాడు. 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో లంక బౌలింగ్‌ను చీల్చిచెండాడు. ఇక, వైభవ్ కాన్ఫిడెన్స్‌పై టీమిండియా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును తాకి.. లిస్ట్-ఎ (List A) క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. తద్వారా శ్రీలంకకు చెందిన కౌశల్య వీరరత్నే పేరిట 21 ఏళ్లుగా ఉన్న (12 బంతుల్లో హాఫ్ సెంచరీ) రికార్డును బద్దలు కొట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం బౌండరీలతోనే (5 ఫోర్లు, 5 సిక్సర్లు) తన హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఇండియా ‘ఎ’ తరఫున అతనికిదే మొదటి అర్ధశతకం. అయితే, లంక కెప్టెన్ సహన్ అరాచ్చిగే వేసిన 9వ ఓవర్లో అవుట్ కావడంతో 6 పరుగుల తేడాతో రికార్డు సెంచరీ చేజార్చుకున్నాడు. కానీ, అవుట్ అయ్యే సమయానికి అతను చేసిన విధ్వంసం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

×
×
Ad

మరోవైపు, వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రస్థానంలో ఇటీవలే మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలు (Asian Games) 2026 కోసం ప్రకటించిన భారత సీనియర్ టీ20 జట్టులో ఈ 15 ఏళ్ల కుర్రాడికి తొలిసారిగా చోటు దక్కింది. కేవలం 15 సంవత్సరాల 71 రోజుల వయసులోనే భారత పురుషుల జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. తద్వారా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట 36 ఏళ్లుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 1989లో సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్‌పై అంతర్జాతీయ అరంగేట్రం (Debut) చేసి, భారత్ తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. రాబోయే విదేశీ పర్యటనలో వైభవ్ కనుక తుది జట్టులో ఆడితే.. సచిన్ రికార్డును అధిగమించి, భారత అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం భారత టీ20 క్రికెట్ చరిత్రలో వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు) అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లో ఉండగా.. వన్డేల్లో సచిన్ (16 ఏళ్ల 238 రోజులు) పేరిట ఆ రికార్డు ఉంది. ఇప్పుడు వీరందరి రికార్డులను తిరగరాస్తూ వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో ఒక సరికొత్త శకానికి నాంది పలకబోతున్నాడు!