Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా లక్నోలో జరిగిన తొలి మ్యాచ్‌లో 15 ఏళ్ల ఈ కుర్రాడికి తుది జట్టు (ప్లేయింగ్-11)లో చోటు దక్కలేదు. శుక్రవారం రాంచీ వేదికగా జరగబోయే రెండో టీ20లో కూడా అతనికి అవకాశం రావడం కాస్త కష్టమే అనిపిస్తోంది. అయినప్పటికీ మ్యాచ్‌కి ముందు రాంచీ నెట్స్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఒకదాని వెనుక ఒకటి భారీ షాట్లు కొడుతూ బంతిని డిస్టాన్స్ స్టాండ్స్‌లోకి పంపించడంతో అందరి చూపు అతడి వైపే మళ్లింది.

వైభవ్ ఆడుతున్న తీరు చూసి అక్కడ ఉన్న పోలీసులు, మీడియా ప్రతినిధులు సైతం నెట్స్ చుట్టూ చేరిపోయారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కన్ను రెప్ప వేయకుండా అతని బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను ఆసక్తిగా గమనిస్తూ ఉండిపోయాడు. తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘనవిజయం సాధించినప్పటికీ, ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో రెండో మ్యాచ్‌లో టాప్ ఆర్డర్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా అనే చర్చ మొదలైంది. నెట్స్‌లో వైభవ్ చూపిస్తున్న అగ్రెసివ్ బ్యాటింగ్ చూస్తుంటే.. ఒకవేళ టీమ్ మేనేజ్‌మెంట్ మార్పుల వైపు మొగ్గుపడితే అతని పేరును ఖచ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది.

మరోవైపు రెండో టీ20 ప్లేయింగ్-11 పై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందిస్తూ ఇంకా ఏదీ ఖరారు కాలేదని స్పష్టం చేశారు. “జట్టును ఇంకా ఫైనల్ చేయలేదు, స్క్వాడ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆడే అవకాశం ఉంది. ఎవరికి ఎంత అవకాశం ఉందో ఇప్పుడు చెప్పలేను” అని వ్యాఖ్యానించారు. దీంతో వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నెట్స్‌లో అతని ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నప్పటికీ, ఆఖరి నిర్ణయం మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌లో 2-0తో తమ ఆధిక్యాన్ని పెంచుకోవాలని పట్టుదలగా ఉంది.