Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో అకాల వర్షాలు, భీకరమైన గాలివాన, పిడుగులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 111 మంది ప్రాణాలు కోల్పోగా, 72 మంది గాయపడ్డారు. కేవలం మనుషులే కాకుండా 170 పశువులు మృతి చెందడం, 227 ఇళ్లు ధ్వంసం కావడం ఈ విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా మే 13న రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వాతావరణం అస్తవ్యస్తమైందని ఊహించని స్థాయిలో ప్రాణనష్టం సంభవించిందని సహాయక కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. జిల్లాల వారీగా చూస్తే ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 24 మంది చనిపోగా, భదోహీలో 16 మంది, ఫతేపూర్‌లో గోడ కూలిన ఘటనలతో సహా మొత్తం 9 మంది మరణించారు. ప్రతాప్‌గఢ్‌లో సిమెంట్ షెడ్లు, గోడలు కూలి నలుగురు బలవ్వగా, కాన్పూర్ దేహత్‌లో పిడుగుపాటుకు ఓ యువతితో పాటు మూగజీవాలు మృతి చెందాయి. దేవరియా, సోన్‌భద్ర జిల్లాల్లో కూడా పిడుగులు పడి, చెట్లు కూలి పలువురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ దారుణ పరిస్థితిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే స్పందిస్తూ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు, బాధితులకు 24 గంటల్లోనే ఆర్థిక సాయం, నిత్యవసర సామగ్రి అందేలా చూడాలని స్పష్టం చేశారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు అండగా నిలవాలని జిల్లా మేజిస్ట్రేట్లను ఆదేశించిన సీఎం, నష్టంపై పూర్తిస్థాయి సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖలను కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.