Tomahawk Missiles: రష్యా- ఉక్రెయిన్ పోరులో అమెరికా ఆయుధం సంచలనం సృష్టిస్తుంది. ఈ ఆయుధం ఇంకా రణరంగంలోకి ప్రవేశించకుండానే మాస్కోను భయపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అందజేస్తున్నట్లు చెబుతున్న ఆయుధం ఏంటో తెలుసా? ప్రాణాంతకమైన టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు. అమెరికా సూపర్ వెపన్ యుద్ధంలోకి రానున్నట్లు తెలియడంతో రష్యా ఆందోళనకు గురి అవుతున్నట్లు కనిపిస్తోందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది నిజం అయితే రష్యా-అమెరికా మధ్య ప్రత్యక్ష ఘర్షణ మొదలు కావచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సోమవారం రష్యా.. ఉక్రెయిన్‌కు అమెరికా టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను సరఫరా చేస్తుందా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.
అసలు ఏమైందంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందజేయాలనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కానీ వాషింగ్టన్ ఉక్రెయిన్ డిమాండ్‌ను పరిశీలిస్తోందని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రష్యా లోపల లాంగ్ రేంజ్ దాడులు చేయడానికి కీవ్‌కు ఇప్పుడు అధికారం ఇవ్వాలని అధ్యక్షుడు ట్రంప్ సూచించారని అమెరికా రాయబారి కీత్ కెల్లాగ్ అన్నారు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం.. బాంబు షెల్టర్లు ఎక్కడ ఉన్నాయో క్రెమ్లిన్ అధికారులు గుర్తుకు ఉంచుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ హెచ్చరించారు.
టోమాహాక్ క్షిపణులు ఎందుకు స్పెషల్..
టోమాహాక్ క్షిపణి 2,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అంటే ఉక్రెయిన్ నుంచి వీటిని ప్రయోగిస్తే అవి మాస్కో, యూరోపియన్ రష్యాలోని చాలా ప్రాంతాలను సులభంగా చేరుకోగలవు. టోమాహాక్ అనేది US నేవీ ఐకానిక్ సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీనిని1970ల నుంచి అభివృద్ధి చేశారు. దీనిని ఓడలు, జలాంతర్గాములు, ల్యాండ్ లాంచర్ల నుంచి ఈజీగా ప్రయోగించవచ్చు. ఇది 1,000 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా కచ్చితంగా చేధించగలదు. వీటిలో బ్లాక్ IV (TACTOM) వెర్షన్ అత్యంత అధునాతనమైనది, ఈ సూపర్ వెపన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని విమానం నుంచి ప్రయోగించినప్పుడు ఒకసారి నిర్దేశించిన లక్ష్యాలను కూడా మార్చుకునే అవకాశం ఉంది. దీని పరిధి వేగం 2,500 కి.మీ దూరం. సబ్‌సోనిక్ వేగం గంటకు 885 కి.మీ. తక్కువ ఎత్తులో ఎగురుతూ ఏ దేశ రాడార్‌కు చిక్కకుండా ప్రయాణించడం దీని ప్రత్యేకత. నావిగేషన్ – GPS, DSMAC (డిజిటల్ సీన్ మ్యాచింగ్), 5 మీటర్ల కచ్చితత్వంతో ఇనర్షియల్ నావిగేషన్, జామ్-రెసిస్టెంట్ GPS శత్రు ఎలక్ట్రానిక్ యుద్ధాల నుంచి రక్షణను అందిస్తుంది. పేలోడ్ – 1,000 పౌండ్ల (450 కిలోలు) సాంప్రదాయ వార్‌హెడ్ లేదా సబ్‌మునిషన్ డిస్పెన్సర్‌ను ఇది కలిగి ఉంది. బ్లాక్ Vలో NAV/COMMS అప్‌గ్రేడ్‌తో మెరుగైన నావిగేషన్ సిస్టం అందుబాటులో ఉంది.
క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ ఆయుధంపై మాట్లాడుతూ.. “ఈ క్షిపణులను ఎవరు ప్రయోగిస్తారు అనేది ప్రశ్న? ఉక్రేనియన్లు లేదా అమెరికన్ సైనికులా ? లక్ష్యాలను ఎవరు నిర్ణయిస్తారు? అమెరికన్లా లేదా ఉక్రేనియన్ల దళాలా?” దీనిపై సమగ్ర విశ్లేషణ అవసరమని ఆయన అన్నారు. ఉక్రెయిన్ సహాయంతో అమెరికన్ నిపుణులు రష్యాపై టోమాహాక్స్‌ను ప్రయోగిస్తే, వారిని రష్యా లక్ష్యంగా చేసుకుంటుందని రష్యన్ ఎంపీ ఆండ్రీ కర్తపోలోవ్ నేరుగా బెదిరింపులకు దిగారు. ట్రంప్ లేదా మరెవరూ కూడా వారిని రక్షించలేరని ఆయన తన ప్రకటనలో స్పష్టంగా చెప్పారు.
టోమాహాక్ క్షిపణులు యుద్ధ గమనాన్ని మార్చవని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నాడు. ఆయన ప్రకారం.. టోమాహాక్ అయినా లేదా ఇతర ఏ క్షిపణులు అయినా కీవ్‌పై రష్యా పట్టును నిలువరించలేవు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యన్ దళాలు నెమ్మదిగా కానీ స్థిరంగా విస్తరిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ మాట్లాడుతూ.. యూరప్ రష్యాతో యుద్ధాన్ని భరించలేదని, కానీ పెద్ద ప్రమాదం జరిగే అవకాశం మాత్రం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అటువంటి పరిస్థితిలో అమెరికా ఉక్రెయిన్‌కు టోమాహాక్ క్షిపణులను అందిస్తే, పరిస్థితి మరింత తీవ్రమవుతుందని చెప్పారు. రష్యా దీనిని ప్రత్యక్ష సవాలుగా తీసుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ అమెరికా, దాని మిత్రదేశాలు మాత్రం ఉక్రెయిన్ తనను తాను రక్షించుకోవడానికి ఇదే ఏకైక మార్గం అని నమ్ముతున్నాయని పేర్కొన్నారు. ఈ క్షిపణులు నిజంగానే ఉక్రెయిన్ నుంచి యుద్ధభూమిలోకి అడుగు పెడితే ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా దిగజారిపోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Nani – Sujeeth Movie: నాచురల్ స్టార్‌తో సుజిత్ సినిమా.. ముహూర్తం ఎప్పుడో తెలుసా..