Bird Flu: అమెరికాలో ఎవియన్ ఫ్లూ ప్రస్తుతం విలయం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఏకంగా 5 కోట్ల కోళ్లు, పక్షులను ఎవియన్ ఫ్లూ బలి తీసుకుంది. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన విపత్తని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఎవియన్ ఫ్లూ దెబ్బకు దేశవ్యాప్తంగా గుడ్లు, కోడి మాంసం తదితరాల రేట్లు తారాజువ్వలా దూసుకుపోయాయి. అసలే ద్రవ్యోల్బణంతో అక్కడ జనం అల్లాడుతున్నారు. ఎవియన్ ఫ్లూ పుణ్యమాని మాంసం రేట్లు మరింత పెరగడంతో మాంసప్రియుల జేబుకు మరింత చిల్లి పడుతోంది.
Read Also: Chhattisgarh Encounter: చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ ఆరుగురు నక్సల్స్ మృతి
హైలీ పాథోజెనిక్ ఎవియన్ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్‌పీఏఐ)గా పిలిచే ఈ ఫ్లూ అడవి బాతుల వంటి వాటి వ్యర్థాలు, ఈకల ద్వారా సోకుతుంది. ఇది అమెరికాలో ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చింది. అనతికాలంలోనే అమెరికా వ్యాప్తంగా విస్తరించింది. ఈ ఫ్లూ ఏకంగా 46 రాష్ట్రాలను చుట్టేసింది. దాంతో ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు లక్షలు, కోట్ల సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులను చంపేయాల్సి వచ్చింది. 2015లోనూ యూఎస్‌లో ఇలాగే దాదాపు 5 కోట్ల పక్షులు ఫ్లూకు బలయ్యాయి. బ్రిటన్‌తో సహా పలు యూరప్ దేశాల్లో కూడా ఎవియన్ ఫ్లూ విలయం సృష్టిస్తోంది. ఎంతలా అంటే బ్రిటన్లో పలు సూపర్ మార్కెట్లు ఒక్కో కస్టమర్ ఇన్ని గుడ్లు మాత్రమే కొనాలంటూ రేషన్ పెడుతున్నాయి.