NTV Telugu Site icon

Urvil Patel: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ ఊచకోత..

Urvil Patel

Urvil Patel

గుజరాత్ బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో వారం వ్యవధిలోనే మరో సెంచరీ సాధించాడు. మంగళవారం ఉత్తరాఖండ్‌పై కేవలం 36 బంతుల్లోనే శతకం బాదాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పటేల్ 41 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. స్ట్రైక్ రేట్ 280.48తో చెలరేగాడు. ఉర్విల్ పటేల్ ఇంతకుముందు త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే టీ20 సెంచరీ సాధించాడు. కాగా.. శతకాలు బాదుతున్న ఉర్విల్ పటేల్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ అతనిని కొనుగోలు చేయలేదు. దీంతో.. ఇప్పుడు ఫ్రాంచైజీలు ఎంత మంచి బ్యాటర్‌ను కోల్పోయమంటూ బాధపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఉత్తరాఖండ్ బ్యాటింగ్‌లో రవికుమార్ సమర్థ్ (54), ఆదిత్య తారే (54), కునాల్ చండేలా (43) పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఉర్విల్ పటేల్‌ అజేయ సెంచరీతో 41 బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో గుజరాత్ 13.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Read Also: iQOO 13 Price: ‘ఐకూ 13’ ఫోన్‌ వచ్చేసింది.. 50 ఎంపీతో మూడు కెమెరాలు, 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ!

మరోవైపు.. ఉర్విల్ పటేల్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ప్రత్యేక క్లబ్‌లో చోటు సంపాదించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేసిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా ఉర్విల్ పటేల్ నిలిచాడు. గతేడాది పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించాడు. SMAT ఒక ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్లు ఎవరెవరు ఉన్నారంటే…
ఉన్ముక్త్ చంద్, ఢిల్లీ, 2013
కరుణ్ నాయర్, కర్ణాటక, 2018
ఇషాన్ కిషన్, జార్ఖండ్, 2019
శ్రేయాస్ అయ్యర్, ముంబై, 2019
రుతురాజ్ గైక్వాడ్, మహారాష్ట్ర, 2022
అభిషేక్ శర్మ, పంజాబ్, 2023
ఉర్విల్ పటేల్, గుజరాత్, 2024*

ఉర్విల్ పటేల్ ఉత్తరాఖండ్‌పై సెంచరీ చేయడంతో మరో రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్‌లో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఉర్విల్ పటేల్ నిలిచాడు. దీంతో.. భారత మాజీ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ రికార్డును బద్దలు కొట్టాడు. 2010లో ముంబై ఇండియన్స్‌పై పఠాన్ 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఉర్విల్ పటేల్ 36 బంతుల్లో సెంచరీ సాధించి రికార్డు బ్రేక్ చేశాడు.

Show comments