సివిల్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించింది.
సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE) 2024 పరీక్షకు దరఖాస్తుల గడువును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) పొడిగించింది. నేటి (మంగళవారం)తో ముగుస్తున్న ఆ గడువును బుధవారం వరకు పొడిగించింది.
అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 14న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దరఖాస్తుల గడువు మార్చి 5(మంగళవారం)తో ముగియడంతో ఆ గడువును ఒక్కరోజు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 150 ఖాళీల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తుల గడువును సైతం పొడిగించింది. ఈ రెండు పరీక్షలకు ఇంకా దరఖాస్తు చేసుకోనివారు మార్చి 6న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకొనే వెలుసుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పరీక్షలు దరఖాస్తులు చేసుకోవచ్చు.
తాజా నిర్ణయంతో మరికొంత మంది అభ్యర్థులకు ఊరట లభించనుంది. ఆయా కారణాల చేత అప్లై చేయకుండా మిగిలిపోయిన అభ్యర్థులు బుధవారం సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.