ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మ్యాచ్‌లు మార్చి 22 నుంచి ఆరంభం కానున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని ముమ్మర సాధన చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఐపీఎల్ కోసం ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు తీసుకొస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రూ.5 కోట్లతో రినోవేషన్ పనులు చేస్తున్నామని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు.
బీసీసీఐ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులతో కలిసి హెచ్‌సీఏ బాస్ జగన్ మోహన్ రావు ఉప్పల్ స్టేడియం రినోవేషన్ పనులను పరిశీలించారు. ఐపీఎల్ తొలి మ్యాచ్ సమయానికి స్టేడియం పూర్తిగా సిద్ధంగా ఉండాలని, రినోవేషన్ పనుల్లో వేగం పెంచాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. స్టేడియానికి కొత్త రూపు తెచ్చేందుకు హెచ్‌సీఏ రూ.5 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. స్టేడియం మొత్తం పెయింటింగ్, నార్త్ స్టాండ్స్‌లో కొత్త రెస్ట్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ అండ్ కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు మారుస్తున్నామని జగన్ మోహన్ రావు తెలిపారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తమకు సహకారం అందిస్తుందని చెప్పుకొచ్చారు. రినోవేషన్ పనులను బీసీసీఐ అధికారులు వైభవ్, యువరాజ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి శరవానణ్, రోహిత్ పరిశీలించారు.
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
59 కార్పొరేట్ బాక్సులతో కలిపి ఉప్పల్ స్టేడియంలో 35,000 మంది ప్రేక్షకులు మ్యాచ్ చూడొచ్చు. ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏడు లీగ్ మ్యాచ్‌లు, ఓ క్వాలిఫైయర్, ఓ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు క్రికెట్ ఫాన్స్ సిద్ధంగా ఉన్నారు. ఇటీవల మొదటి రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్స్ రిలీజ్ చేయగా.. నిమిషాల్లో అమ్ముడుపోయాయి. టికెట్స్ దొరకని వారు తీవ్ర నిరాశకు గురయ్యారు.