Srinivasa Varma: ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. తణుకు మున్సిపాలిటీలో ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అంటూ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే పార్టీ కార్యకర్తలు చప్పట్లు కొడతారని భావించి దూకుడుగా ప్రవర్తించడమంటూ.. నరికేస్తాం, చంపేస్తాం.. అని మాట్లాడితే ఆ నాలుకనే కోస్తామని హెచ్చరించారు. టిడిఆర్ బాండ్ల విషయమై కారుమూరి తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని, చాలా తక్కువ రోజుల్లో జైలుకు వెళ్లే పరిస్థితి ఎదురవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
కారుమూరిని ఉద్దేశించి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. నోరు మూసుకుని ఇంట్లో కూర్చో.. నీకు కాళ్లు చేతులు లేకుండా నరకడానికి కత్తిపట్టే అవకాశం రాకుండా మేము ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని నేతలపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. కారుమూరి నాగేశ్వరరావుతో పాటు పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి నాయకులకు ఎలాంటి సంస్కారం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగంపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి.