Kishan Reddy: అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. హిజాబ్ ధరించే ముస్లిం మహిళ దేశ ప్రధాని కావాలని ఓవైసీ కోరడం వెనుక దేశ విభజన రాజకీయాలే ఉన్నాయని ఆయన విమర్శించారు. నిజంగా అంత దమ్ము ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు వెళ్లి అక్కడ హిందూ మహిళ ప్రధాని కావాలని డిమాండ్ చేయగలరా అని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
భారతదేశంలో మైనారిటీ వర్గాలకు అత్యున్నత గౌరవం లభించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. దేశానికి రాష్ట్రపతులుగా మైనారిటీ వర్గాలకు చెందినవారు బాధ్యతలు నిర్వహించారని, ముఖ్యంగా అబ్దుల్ కలాం వంటి మహానుభావుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనని స్పష్టం చేశారు. అయినా కూడా మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తూ ప్రజలను విభజించే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
Vivo X200T Launch: 6200mAh బ్యాటరీ, 50MP సోనీ-శాంసంగ్ కెమెరా.. ‘వివో ఎక్స్200’ కొత్త లీక్స్ ఇవే!
ఓవైసీ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ప్రజలను విభజించే కుట్రలు జరుగుతున్నాయని ప్రజలు గమనించాలని కిషన్ రెడ్డి అన్నారు. భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల పరిస్థితులు నేడు ప్రపంచానికి అద్దంలా నిలుస్తున్నాయని, అక్కడి పరిస్థితే ఇక్కడ కూడా రావాలని ఓవైసీ కోరుకుంటున్నారని ప్రశ్నించారు. భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్న కారణంగానే ప్రజాస్వామ్యం బలంగా కొనసాగుతోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హిందువులు మెజారిటీగా లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదని.. ఎవరికీ రక్షణ ఉండదని, పాకిస్తాన్–బంగ్లాదేశ్‌ల తరహా పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు.
ప్రధాని మోడీ పాలనలో మతాల పేరుతో రాజకీయాలు జరగవని, దేశ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దేశ అభివృద్ధిని ఆకాంక్షించాల్సిన సమయంలో ముస్లిం మహిళ ప్రధాని కావాలని డిమాండ్ చేస్తూ విభజన రాజకీయాలు చేయడం దేనికి సంకేతమో ఓవైసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో దళితులు, గిరిజనుల బస్తీలు, చెరువులను కబ్జా చేసిన ఘనత ఓవైసీదేనని ఆరోపించారు. అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం ఓవైసీకి అలవాటుగా మారిందని, ఆయన సలహాలు బీజేపీకి అవసరం లేదని తేల్చిచెప్పారు.
సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన ఘనత భారత ఆర్మీదని, ప్రధాని మోడీ దృఢ నిర్ణయాల ఫలితమేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవన్నీ ఓవైసీ కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏం చేయాలో ప్రధాని మోడీకి బాగా తెలుసని, అవసరమైన సమయంలో అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం తమకు తెలుసని.. తమ లక్ష్యం దేశ అభివృద్ధేనని, రాజకీయ వారసత్వాలు, మతోన్మాద మజ్లిస్ పార్టీ సూచనలు తమకు అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
