NTV Telugu Site icon

Bhupathi Raju Srinivasa Varma: లడ్డూ వివాదంపై కేంద్రం సీరియస్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Bhupathi Raju Srinivasa Var

Bhupathi Raju Srinivasa Var

Bhupathi Raju Srinivasa Varma: లడ్డూ వివాదంపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పందించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ రోజురోజుకీ దిగజారిందని విమర్శించారు. అంతర్వేది రథం తగలబెట్టడం సహా అనేక ఘటనల్లో నాటి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదన్నారు. కల్తీ నెయ్యి అంశం నిజమని, టెస్టు రిపోర్టులు వచ్చాయన్నారు. మీ తండ్రి సైతం ఏడు కొండలను రెండు కొండలుగా చేయాలని చేసిన ప్రయత్నం అందరికీ తెలుసని విమర్శలు గుప్పించారు. తిరుమలలో దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించాలని, కానీ మీరు ఒక్కరే వెళ్లి పట్టు వస్త్రాలు ఇచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీయలేదా అంటూ ప్రశ్నించారు. మీ సతీమణికి అభ్యంతరం ఉంది కాబట్టి గుడికి రాలేదని, కానీ దంపతులు ఇవ్వాల్సిన చోట ఒక్కరే ఇవ్వడం శాస్త్ర విరుద్ధమన్నారు. అలాగే డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల వెళ్ళడం కూడా నిబంధనల ఉల్లంఘనే అవుతుందన్నారు. మీ హయాంలో టీటీడీ పాలక వర్గానికి మీరు ఇచ్చిన విలువ ఏంటో అందరికీ తెలుసన్నారు. చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిని రెండు సార్లు ఛైర్మన్‌ను చేసి కుటుంబ గుత్తాధిపత్యం ప్రదర్శించారన్నారు. లడ్డుపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని.. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.లడ్డు విషయంలో కేంద్రం కూడా సీరియస్‌గా ఉందని.. అవసరమైతే విచారణలో కేంద్రం కూడా తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు.

Read Also: RK Roja: జగన్ దమ్ము, ధైర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు..

విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రజల సెంటిమెట్లను నిలబెట్టేలా ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ విషయంలో కొత్త ప్రక్రియ ఏమి లేదన్నారు. 2014 ముందు ఉన్న ప్రభుత్వం నిర్ణయాలపైనే ప్రస్తుతం చర్చ జరుగుతుందన్నారు. ఉద్యోగుల భద్రత, సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితులు పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం పని చేస్తున్నామన్నారు. ప్యాకేజీలతో తత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్థిక మంత్రి నుంచి ప్రధాని దృష్టికి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్లాలని, ఉద్యోగులకు నష్టం కలగకుండా చూడాలని ఆలోచన చేస్తున్నామన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు లాభాల్లో ఉన్నాయన్నారు.

Read Also: Botsa Satyanarayana: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్

అవసరం లేకపోయినా విస్తృతపరచడం, గత పాలకుల నిర్ణయాలు, రాయబరేలిలో పరిశ్రమలు పెట్టడం, వేల కోట్లు పెట్టుబడులు పెట్టడం వల్ల స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిందన్నారు. నష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని కేంద్ర మంత్రి వెల్లడించారు. కేంద్రం సాయం చేస్తూ పరిశ్రమను లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇది ప్రజా ధనం.. నష్టాల్లో ఉన్న పరిశ్రమ కోసం నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేదన్నారు. ఆర్థిక మంత్రికి స్టీల్ ప్లాంట్‌పై అవగాహన ఉందన్నారు. సెయిల్, ఎన్‌ఎండీసీ అధికారులతో సమావేశం అయ్యామన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు లాభాల్లో ఉన్నాయన్నారు. కొన్ని అంశాలపై చర్చించామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమను విలీనం చేసే సమయంలో సాంకేతిక సమస్యలు ఉంటాయని.. వాటిని అధిగమించాలనే అంశంపై సెయిల్ అధికారులతో చర్చ జరిపామన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ దగ్గర అదనంగా ఉన్న భూమి 1500 ఎకరాల భూమిని ఎన్‌ఎండీసీకి ఇచ్చి ఆర్ధిక సహకారం, పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఎన్‌ఎండీసీ సంస్థతో చర్చించామన్నారు.

కార్మికులు ఆందోళన చెందడం సహజమేనని.. సాధ్యాసాధ్యాలను అర్థం చేసుకోవాలన్నారు. ఉద్యోగులు, కార్మికులను తప్పు పట్టడం లేదన్నారు. ఉత్పత్తి ఎంత, కార్మికులు ఎంత అన్న సమాచారం తీసుకున్నామన్నారు. మిగతా సంస్థలతో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులు ఎక్కువ ఉన్నారని.. ఉత్పత్తి తక్కువగా ఉందన్నారు. కార్మికులను బాధ్యులను చేయలేమన్నారు. సమర్ధవంతమైన అధికారులను నియమించామన్నారు. పనిలేనప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించక తప్పదన్నారు. నష్టాలు భరించే పరిస్థితి ప్రభుత్వానికి లేదన్నారు. శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్నారు.

 

Show comments