Britain: బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆ దేశ ప్రధాని లిజ్ ట్రస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ దేశ రాజకీయాల్లో తీవ్ర కుదుపులకు కారణం కావడంతో ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై తీవ్ర ఆందోళలనలకు దారి తీసింది. ఈ మినీ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు ఎక్కువ కాగా… ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించినట్లు తెలుస్తోంది.
దేశ ఖజానాకు ఇతర ఆదాయ మార్గాలను చూపించకుండా 4300 కోట్ల పౌండ్ల మేరకు పన్నుల్లో కోతలు విధించాలని, తద్వారా ప్రభుత్వ ఆదాయానికి పడే గండిని మార్కెట్‌లో బాండ్ల జారీ ద్వారా పూడ్చుకోవాలని ట్రస్ సర్కారు తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఆ దేశ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బ్రిటన్ రుణ భారం పెరిగిపోయే అవకాశాలుండటంతో దేశ కరెన్సీ అయిన పౌండ్ విలువ పడిపోసాగింది. కాగా, ఆయన స్థానంలో కేబినెట్ మాజీ మంత్రి జెరేమీ హంట్‌ను నియమిస్తూ ట్రస్ నిర్ణయం తీసుకొన్నారు. లిజ్ ట్రస్, క్వార్టెంగ్ పదవులు చేపట్టి శుక్రవారం నాటికి 38 రోజులే కావడం గమనార్హం.
Snow covered: మంచు దుప్పటి కప్పకున్న హైదరాబాద్.. మళ్లీ మొదలైన వర్షం
ట్రస్ ప్రభుత్వం మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ చేసిన కార్పొరేట్ పన్ను ప్రతిపాదనను మళ్లీ ముందుకు తీసుకురాక తప్పలేదు. కార్పొరేట్ పన్నును 25 శాతానికి పెంచి.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర్చాలని సునాక్ ఇంతకుముందు ప్రతిపాదించారు. ట్రస్ సర్కారుకు తగులుతున్న ఎదురుదెబ్బలు పాలక కన్జర్వేటివ్ పార్టీలో తిరుగుబాటుకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిటిష్ మార్కెట్లు కుదేలవుతున్న నేపథ్యంలో రిషి సునక్‌కు ఛాన్సలర్ బాధ్యతలు అప్పగించాలని కన్జర్వేటివ్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.