NTV Telugu Site icon

Vijayawada: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. ఉరేసుకుని భార్య సూసైడ్

Suicide

Suicide

Vijayawada: జీవితాంతం తోడునీడలా కలిసి జీవిస్తామని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. జీవిత ప్రయాణంలో ఎన్ని కష్టాలెదురొచ్చినా చివరి వరకు కలిసి ఉంటామని పెళ్లితో ముందడుగు వేస్తారు. ఈ జీవిత ప్రయాణంలో తన తోడును కోల్పోతే ఆ బాధ వర్ణణాతీతం. కేవలం దానిని అనుభవించేవారికే దాని విలువ తెలుస్తుంది. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాదు. అలాంటి సమయంలో కొంత మంది భాగస్వామి జ్ఞాపకాలతో బతికేస్తుంటారు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక చావడానికి కూడా సిద్ధపడతారు. అలాంటి ఘటనే విజయవాడ నగరంలో చోటుచేసుకుంది. భర్త మృతి చెందారన్న వార్తను తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకొని తనువుచాలించింది. నాగరాజు, ఉష దంపతులకు 18 నెలల క్రితం వివాహం జరిగింది.

Read Also: Bengaluru Murder Case: ఆత్మరక్షణ కోసం చంపేశా.. డెత్ నోట్‌లో రాసుకున్న నిందితుడు

ప్రసాదంపాడు లో వంట మాస్టర్‌గా నాగరాజు పనిచేస్తున్నాడు. అజిత్ సింగ్ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నాగరాజు నివసిస్తున్నాడు.బీఆర్టీఎస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని నాగరాజు మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాదం గురించి భార్య ఉషకు తెలియజేశారు. ఒక్కసారిగా భర్త మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. నాగరాజు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. దీంతో ఉష అక్కడ్నుంచి ఇంటికి వచ్చింది. నాగరాజు లేని జీవితం తనకు వద్దనుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు యువతిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒకేరోజు భార్యాభర్తలు మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show comments