Udhayanidhi Stalin: తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. తమిళనాడులోని వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ, పునరుద్ధరణ, పునరావాస పనులు చేపట్టేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. “తమిళనాడు ప్రభుత్వం తరపున వరద ప్రభావిత జిల్లాల్లో సమగ్ర సహాయం, పునరుద్ధరణ, పునరావాస పనులను చేపట్టడానికి జాతీయ విపత్తు సహాయ నిధిని వెంటనే విడుదల చేయాలని ప్రధానమంత్రిని అభ్యర్థించాను. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరినట్లు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి మాకు హామీ ఇచ్చారు.” అని ఉదయనిధి స్టాలిన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తమిళనాడు క్రీడల మంత్రిగా ఉన్న ఉదయనిధి, జనవరి 19న చెన్నైలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించారు. క్రీడల నిర్వహణను ప్రదర్శించే కాఫీ టేబుల్ బుక్‌ను ప్రధానికి బహూకరించారు. సీఎం ట్రోఫీ గేమ్స్ 2023, ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్‌షిప్‌కు తమిళనాడు ఆతిథ్యం ఇస్తుంది.
Read Also: Javed Ahmed Mattoo: ఢిల్లీలో పట్టుబడ్డ హిజ్బుల్ టెర్రరిస్ట్ జావేద్ అహ్మద్ మట్టూ
రెండు రోజుల క్రితం తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోడీ తిరుచిరాపల్లిలో జరిగిన కార్యక్రమంలో రూ.20,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల వల్ల నష్టపోయిన కుటుంబాల పరిస్థితి తనను ఎంతగానో కదిలించిందని అన్నారు. స్థానికులకు మద్దతు ఇస్తూ, “2023 చివరి కొన్ని వారాలు తమిళనాడులో చాలా మందికి కష్టంగా ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా మా తోటి పౌరుల్లో చాలా మందిని కోల్పోయాము.” అని అన్నారు.
గత నెల తమిళనాడులోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు వరదలను తెచ్చిపెట్టాయి ఈ వరదల వల్ల భారీ విధ్వంసం సంభవించింది. తీవ్రవరదల వల్ల రాష్ట్ర రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది. చెన్నైలో నీటి ఎద్దడి సమస్యలతో ప్రభుత్వం పోరాడుతుండగా, దక్షిణ తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు 31 మందిని బలిగొన్నాయి.