Kakarla Suresh: ఉదయగిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉదయగిరి మండలం సంజీవ రాజుపల్లి గ్రామం నుంచి బుధవారం పల్లె పల్లెకు కాకర్ల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. పల్లె ప్రజలు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ పొన్ను బోయిన చంచలబాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డిలు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
మద్దతు తెలిపిన మహిళలు
మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలంటే ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలవాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. వింజమూరులో టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ పొందిన మహిళలు కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులను కలిసి మద్దతు తెలిపారు. ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు. నిస్వార్థ పరుడు, ప్రజా సేవకుడైన కాకర్ల సురేష్‌కు మద్దతు ఇస్తే నియోజక వర్గంలో యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
టీడీపీలో చేరిన 50 కుటుంబాలు
ఉదయగిరి మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా అయ్యవారిపల్లికి చేరుకున్న కాకర్ల సురేష్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మూకుమ్మడిగా గ్రామస్తులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కాకర్ల సురేష్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, వేగంగా అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఉదయగిరి మండల నాయకత్వంలో నిర్వహించిన పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా గంగురాజు చెరువు పల్లి, సంజీవ్ రాజు పల్లి, చెర్లోపల్లి, చెరువుపల్లి, వడ్డీ పాలెం, బండ కింద పల్లి, అయ్యవారి పల్లి, ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని.. అభివృద్ధి ఏమిటో చూపిస్తానని ప్రజలను అభ్యర్థించారు. సీసీ రోడ్లు డ్రైనేజీ మౌలిక వసతులకు కృషి చేస్తానని, మూల పల్లెలకు మేలు పల్లెలు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి మండలంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తానని.. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మారుమూల ప్రాంతమైన మూల పల్లెలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో సీనియర్ నాయకులు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ చేపట్టిన పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కదిరి రంగారావు మండల నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఉదయగిరి మండలంలోని కొండ కింద పల్లె గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ను, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరిగెడుతుందని.. కనుక వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. కాకర్ల సురేష్ తరపున మాజీ శాసన సభ్యులు వంటేరు వేణు గోపాల్ రెడ్డి జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిస్వార్థ పరుడు,సేవాభావం కలిగిన ఉదయగిరి టీడీపీ అభ్యర్ధి కాకర్ల సురేష్ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
కుటుంబ సభ్యుల ప్రచారం
ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులంతా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాకర్ల సురేష్ మాతృమూర్తి మస్తానమ్మ, మరదలు కాకర్ల సురేఖ, తనయుడు కాకర్ల సంహేత్, కూతురు ధాత్రి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కలిగిరి మండలంలోని గ్రామాల్లో కాకర్ల సురేష్ మాతృమూర్తి మస్తానమ్మ, మరదలు కాకర్ల సురేఖలు ప్రచారం చేపట్టారు. ఉదయగిరి పట్టణంలో కాకర్ల సురేష్ పిల్లలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సమస్యలు పరిష్కారం కావాలంటే కాకర్ల సురేష్‌కు ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. మరోవైపు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో పల్లెల్లో ప్రగతి సాధించాలంటే ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, తానా మాజీ ప్రెసిడెంట్ వేమన సతీష్ తెలిపారు. ఉదయగిరి మండలంలో కొండ కింద పల్లి గ్రామాలలో జరుగుతున్న పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.