Kite String Slits Throat: చైనా మాంజా అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. సామాన్య జనంపై పంజా విసురుతూ బ్లాక్ మార్కెట్ నగరంలో అమ్ముడువున్న మాంజా.. కైట్ లవర్స్‌కు మజా తెస్తున్నప్పటికీ.. మనుషుల ప్రాణాలు తీస్తోంది. పతంగులను ఎగురవేసే సమయంలో ఎదుటివారి గాలిపటాన్ని నేలకూల్చడానికి చైనా మాంజాను వాడుతున్నారు. ప్లాస్టిక్ దారానికి గాజుపొడి అద్ది ఈ మాంజాను తయారు చేస్తారు. దీనివల్ల గాలిపటం ఎగురవేసే వారికి, పక్కనున్న వారి చేతులకూ గాయాలవుతాయి. పతంగులు ఎగురవేస్తున్న సమయంలో దారం మనుషుల పీకలకు చుట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తరాయణ వేడుకల మధ్య గుజరాత్‌లోని వివిధ నగరాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో మూడేళ్ల బాలికతో పాటు 35 ఏళ్ల వ్యక్తి గొంతును మాంజా కోయడంతో వారిద్దరు మృతి చెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
మెహ్సానా జిల్లాలోని విస్‌నగర్ పట్టణంలో మధ్యాహ్నం తన తల్లితో కలిసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా కృష్ణ ఠాకూర్ (3) మెడను కోయడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులతో పాటు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో సంఘటనలో, వడోదరా నగరంలోని ఛని ప్రాంతంలో మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా స్వామీజీ యాదవ్ మెడను గాలిపటం మాంజా కోయడంతో మరణించాడు. యాదవ్ తన ద్విచక్ర వాహనంపై వంతెనపైకి వస్తుండగా, గాలిపటం తీగ అతని గొంతును కోయడంతో, అతను తక్షణమే చనిపోయాడని ఛని పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
Stampede In Cuttack: జాతరలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 20 మందికి గాయాలు
ఇదిలావుండగా, గుజరాత్‌లో రోజంతా గాలిపటాల తీగలతో గాయపడిన అనేక కేసులు నమోదయ్యాయని 108 ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ (ఇఎంఎస్) వ్యవస్థ అధికారులు తెలిపారు. గాలిపటాల తీగల వల్ల జరిగిన వేర్వేరు ఘటనల్లో కొందరు వాహనాలపై నుంచి కిందపడిపోయారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు టెర్రస్‌ల నుండి పడి గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అధికారులు తెలిపిన డేటా ప్రకారం.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 62 మంది వ్యక్తులకు మాంజా వల్ల గాయాలు కాగా, 164 మంది ఎత్తు నుంచి పడి గాయపడ్డారు. దీంతో పాటు 400 మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డారు. ఈ గణాంకాలలో అహ్మదాబాద్‌లో 25 గాలిపటాల గాయాలు, 56 రోడ్డు ప్రమాదాలు, 36 కేసుల్లో ఎత్తు నుంచి పడిపోవడం వల్ల గాయాలు సంభవించాయి. ఈ మాంజా కారణంగా అనేక పక్షులు, జంతువులు కూడా గాయపడ్డాయి.