Site icon NTV Telugu

Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Encounter

Encounter

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించగా.. పొరుగున ఉన్న సుక్మా జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని పోలీసు అధికారి శనివారం తెలిపారు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వివిధ భద్రతా బలగాలకు చెందిన సిబ్బంది నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉండగా కాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. మావోయిస్టుల కంచుకోటగా భావించే బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల ట్రై జంక్షన్‌లో ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), ‘బస్తర్ ఫైటర్స్’, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దాని ఎలైట్ యూనిట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) మరియు మూడు జిల్లాల నుంచి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)కి చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం ఈ ఆపరేషన్‌ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టినప్పుడు నక్సలైట్లు కాల్పులు జరిపారని, దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు.

Read Also: Rekha Jhunjhunwala: సముద్ర వ్యూ చెడిపోతుందని.. రూ.118 కోట్లతో బిల్డింగ్ మొత్తాన్ని..

కాల్పుల అనంతరం, ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలతో పాటు ఆయుధాలు కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నామని అధికారి తెలిపారు. ఇద్దరు మావోయిస్టులు ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదని, ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఐజీ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అదే ఆపరేషన్‌లో భాగంగా దంతెవాడ-సుక్మా సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలడంతో బస్తర్ ఫైటర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. సుక్మా జిల్లాలోని జాగర్‌గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడితుమ్నార్ గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో అంతర్ జిల్లా సరిహద్దులో ఉన్న అటవీప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు పేలుడు సంభవించిందని ఆయన చెప్పారు.

గాయపడిన జవాన్లను బస్తర్ ఫైటర్స్-దంతెవాడకు చెందిన కానిస్టేబుళ్లు వికాస్ కుమార్ కర్మ, రాకేష్ కుమార్ మార్కంగా గుర్తించారు. తదుపరి చికిత్స కోసం రాయ్‌పూర్‌కు విమానంలో తరలించే ముందు ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. గాయపడిన జవాన్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు.

Exit mobile version