TVS iQube New Variants in India: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ‘టీవీఎస్’ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. తాజాగా మరో రెండు కొత్త వేరియంట్లను కంపెనీ రిలీజ్ చేసింది. కంపెనీ మొదటిసారిగా తమ లైనప్‌ను రిఫ్రెష్ చేసిన రెండు సంవత్సరాల తర్వాత ఇవి వచ్చాయి. దీంతో ఐక్యూబ్ స్కూటర్ ఇప్పుడు మూడు విభిన్న బ్యాటరీ ఎంపికలతో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఐక్యూబ్ స్కూటర్ ఇప్పుడు 11 రంగుల్లో లభిస్తోంది.
తాజాగా రిలీజ్ అయిన రెండు వేరియంట్లలో ఐక్యూబ్ బేస్ వేరియంట్ ఒకటి. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ.95,000. 2.2kWh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. గంటకు 75 కిమీ గరిష్ఠ వేగాన్ని ఇది అందుకుంటుంది. రెండు గంటల్లో ఈ బ్యాటరీ 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. సీటు కింద 30 లీటర్ల స్టోరేజ్ ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఐదు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, నావిగేషన్, థెఫ్ట్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఐక్యూబ్ ఎస్‌టీలో 3.4kWh బ్యాటరీ ప్యాక్‌తో మరో కొత్త వేరియంట్ వచ్చింది. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ.1.56 లక్షలు. దీని రేంజ్ 100 కిలోమీటర్లు. దీని బ్యాటరీ 2:50 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీంట్లోనూ 7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. బ్లూటూత్, అలెక్సా వాయిస్ అసిస్ట్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి ఫీచర్లూ ఉన్నాయి. ఎస్‌టీలోనే 5.1kWh వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ.1.85 లక్షలు కాగా.. రేంజ్ 150 కిలోమీటర్లు. ఎస్‌టీ వేరియంట్లను జులై 15కు ముందు బుక్ చేసుకున్న వారికి రూ.10,000 రాయితీ (లాయల్టీ బోనస్) లభిస్తుంది.
Also Read: Tata Play-Amazon Prime: ఇకపై డీటీహెచ్‌లోనూ ప్రైమ్ వీడియో!
తాజాగా వచ్చిన రెండు కొత్త వేరియంట్లతో కలిపి ఐక్యూబ్ స్కూటర్ ఇప్పుడు మొత్తం ఐదు వేరియంట్లలో వస్తోంది. ఐక్యూబ్ (2.2 kWh), ఐక్యూబ్ (3.4 kWh), ఐక్యూబ్ ఎస్ (3.4 kWh), ఐక్యూబ్ ఎస్‌టీ (3.4 kWh), ఐక్యూబ్ ఎస్‌టీ (5.1 kWh) వేరియంట్లలో అందుబాటులో ఉంది. మార్కెట్లో ఐక్యూబ్ స్కూటర్‌లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.