బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్-ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు అభిమానులూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రెండు టాప్ టీమ్స్ మధ్య రసవత్తర పోరును చూసేందురు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన ప్రారంభానికి ముందే ఎంతో హైప్ వచ్చింది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు రకరకాల ప్రయోగాలు మొదలు పెట్టింది. భారత్‌లో స్పిన్‌ను ఎదుర్కొనేందుకు సిడ్నీలోనే స్పిన్ పిచ్ తయారు చేసుకొని ప్రాక్టీస్ చేసింది కూడా. ఈ సిరీస్‌లో భారత్ స్పిన్ పిచ్‌లను ఏర్పాటు చేస్తుందని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇలా చేయడం వల్ల భారత్‌కు నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే? ఇటీవల జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో భారత్ ఆధిపత్యం చెలాయించినా.. టెస్టుల్లో ఆ పరిస్థితి ఉండటం కష్టమే. గతేడాది చివర్లో జరిగిన బంగ్లాదేశ్ టెస్టులే దీనికి నిదర్శనం. భారత బ్యాటర్లలో రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ మినహా మిగతా బ్యాటర్లు అంతగా ఆకట్టుకోలేదు. శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా ఒక ఇన్నింగ్స్‌లో రాణించినా.. మిగతా ఇన్నింగ్సుల్లో విఫలమయ్యారు.
స్పిన్ పిచ్‌లతో అందుకే సమస్య!
ప్రస్తుతం స్పిన్‌ను ఎదుర్కొనేందుకు మన బ్యాటర్లూ కాస్త ఇబ్బందులు పడుతున్నారు. స్పిన్‌లో విరాట్ కోహ్లీ (265) కన్నా రవిచంద్రన్ అశ్విన్ (270) ఎక్కువ పరుగులు చేశాడంటేనే టీమిండియా బ్యాటర్లు ఏమాత్రం ఫామ్‌లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. 2022లో భారత్ మొత్తం ఏడు టెస్టులు ఆడింది. వీటిలో మూడింట ఓటమిపాలైంది. వీటిలో రెండు విజయాలు బంగ్లాపై సాధించినవే. కానీ వీటిలో భారత్ ఆధిపత్యం చెలాయించలేదు. అతి కష్టం మీద గెలిచింది. ముఖ్యంగా స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఇప్పుడు స్పిన్ పిచ్ తయారు చేస్తే.. ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్.. భారత్‌ను తెగ ఇబ్బందిపెట్టేందుకు రెడీగా ఉన్నాడు. భారత్‌పై లియోన్ రికార్డు చూస్తేనే.. స్పిన్ ట్రాక్‌పై అతను ఎంతలా సమస్యలు సృష్టిస్తాడో అర్థం చేసుకోవచ్చు. అతను భారత్‌పై మొత్తం 22 టెస్టులు ఆడి 94 వికెట్లు తీసుకున్నాడు. వీటిలో ఏడుసార్లు ఐదు వికెట్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే భారత గడ్డపై ఆడిన ఏడు మ్యాచుల్లో 34 వికెట్లు తీసుకున్న అతను మూడుసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.
Also Read: Dell Layoffs: లే ఆఫ్ బాటపట్టిన డెల్..6,650 ఉద్యోగులకు గుడ్‌బై
ఇండియాలో జరిగిన టెస్టు సిరీసుల్లో భారత జట్టుకు అద్భుతమైన రికార్డు ఉంది. 2012 నుంచి స్వదేశంలో జరిగిన మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలోనే భారత్ ఓడింది. అయితే ఈ ఓటములను జాగ్రత్తగా గమనిస్తే ప్రత్యర్థి స్పిన్ బౌలింగ్ బలంగా ఉండటం కనిపిస్తుంది. దీని వల్లనే భారత్ ఈ మ్యాచులు ఓడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2012 నవంబరులో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడింది. ఆ మ్యాచ్‌లో ఎడం చేతి వాటం స్పిన్నర్ పనేసర్ ఏకంగా 11 వికెట్లు తీసుకోగా.. స్వాన్ 8 వికెట్లతో రాణించాడు. అదే సిరీస్‌లో కోల్‌కతాలో జరిగిన మ్యాచులో పనేసర్ నాలుగు వికెట్లు తీసుకోవడంతో.. తొలి ఇన్నింగ్స్‌లోనే భారత్ ఆత్మరక్షణలో పడింది. ఇక 2017లో ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన మ్యాచ్‌లో స్టీవ్ ఓకీఫీ ఏకంగా 12 వికెట్లతో రాణించడంతో భారత్ ఓటమిపాలైంది. చివరగా భారత్ స్వదేశంలో ఓడింది 2021లో. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ డామ్ బెస్.. తొలి ఇన్నింగ్స్‌లోనే నాలుగు వికెట్లు తీసుకోగా.. మరో స్పిన్నర్ జాక్ లీచ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో రాణించాడు. ఈ లెక్కన స్పిన్ పిచ్‌లు తయారు చేస్తే అవి భారత్‌కే సమస్యగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Heavy Demand For Roses: ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. మన గులాబీలకు యమ గిరాకీ