Tula Uma: వేములవాడ రాజకీయాలు వేడెక్కాయి. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తులా ఉమకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వేములవాడ బరి నుంచి వికాస్ రావు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తుల ఉమ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తనకు బీజేపీ అన్యాయం చేసిందని వెక్కి వెక్కి ఏడ్చిన తుల ఉమ, తనకు ఫోన్ చేసే బిజెపి నేతలను చెప్పుతో కొడతానని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీలో బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని, అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారని తుల ఉమ ఆరోపించారు. తనను నమ్మించి మోసం చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Also Read: PM Modi: ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో కమిటీ ఏర్పాటు
ఇదిలా ఉండగా.. బీజేపీ పార్టీపై అసంతృప్తితో ఉన్న నాయకురాలు, ఉమ్మడి కరీంనగర్ మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ ఇంటికి పలు పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తుల ఉమ నివాసానికి చేరుకొని ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌లు ఆహ్వానం పలికారు. తుల ఉమ నివాసంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీలోకి రావాలని బీఆర్‌ఎస్ నేతలు కూడా ఆహ్వానం పలికారు.
తుల ఉమ గొప్ప ఉద్యమ నాయకురాలు అని, కానీ బీజేపీ పార్టీ ఆమెను మోసం చేసిందని ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్ అన్నారు. తుల ఉమ ప్రజల కోసం పోరాటం చేశారని, సామాన్య ప్రజలకు అండగా నిలబడ్డారని తెలిపారు. తాము ఎలాంటి పొలిటికల్ ప్రయోజనాల కోసం రాలేదని.. కేవలం కలిసి సానుభూతి చెప్పేందుకు మాత్రమే వచ్చామన్నారు. సీనియర్ లీడర్, గొప్ప పేరుంది, తెలంగాణ ఉద్యమంలో పని చేసింది, అట్టడుగు ప్రజల కోసం పని చేసిందని తెలిపారు. బీజేపీ ఆమెను అవమానించి నామినేషన్ వేశాక భీ ఫామ్ ఇవ్వలేదని విష్ణునాథ్ పేర్కొన్నారు. తుల ఉమ ఎప్పుడూ ప్రజలతో ఉన్న నాయకురాలు అంటూ ఆయన చెప్పారు.