TTP Militants Training: పాముకు పాలు పోసి పెంచినా, చివరకు అది విషమే ఇస్తుంది కానీ అమృతం ఇవ్వదు అనే సామెత పాకిస్థాన్ విషయంలో నిజం అవుతోంది. ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ సమాజంపైకి ఉగ్రవాదులను ఎగదోసిన చరిత్ర ఆయన సొంతం. తాజాగా లాడెన్ పేరు మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఆయన ఒకప్పటి డెన్‌ను ఇప్పడు తెహ్రీక్-ఇ-తాలిబాన్లు సొంతం చేసుకున్నారు. ఈ వార్త బయటికి రాగానే ఒక్కసారిగా పాక్ కలవరపాటుకు గురైంది. 2001 లో ధ్వంసమైన ఒసామా బిన్ లాడెన్ అత్యంత ప్రసిద్ధ శిక్షణా శిబిరం మళ్లీ చురుకుగా మారడం పాక్ వెన్నులో వణుకుపుట్టిస్తుంది. ఈ శిక్షణా శిబిరం పేరు అల్ ఫరూకి ఆత్మాహుతి శిబిరం. తాజాగా దీనిని తెహ్రీక్-ఇ-తాలిబాన్ యోధులు స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన వార్త దాయాది దేశాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. పాక్ కలవరానికి కారణాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Bandi Sanjay : సంజయ్ చొరవ.. రంగంలోకి వైమానిక దళ హెలికాప్టర్
ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ..
ఇస్లామాబాద్ పోలీసులు బుధవారం TTP కి చెందిన ఒక ఉగ్రవాదిని అరెస్టు చేశారని ఆ దేశానికి చెందిన ఒక పత్రిక పేర్కొంది. విచారణలో ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి ప్రణాళిక వేస్తున్నాడని, అతను TTP ఫైటర్ అని, అల్ ఫరూకి శిబిరంలో శిక్షణ పొందాడని వెల్లడైంది. దీంతో ఒక్కసారిగా పాకిస్థాన్ కలవరపాటుకు గురైంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ సమీపంలోని పాక్టికాలో ఉన్న అల్ ఫరూకి ఆత్మాహుతి శిబిరం ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్‌కు చెందినది. లాడెన్ ప్రతి సంవత్సరం ఇక్కడ 1000 మంది భయంకరమైన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేవాడని సమాచారం. ఈ రహస్య స్థావరాన్ని పర్వతం కింద నిర్మించారు. లాడెన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు రష్యన్, అమెరికన్ దళాలపై దాడి చేసేవారు. 2001 లో అమెరికా ఈ రహస్య స్థావరాన్ని వైమానిక దాడి ద్వారా నాశనం చేసింది. దీని తరువాత ఏ సమూహమూ ఇక్కడ విడిది చేయలేదు. తాజాగా ఇక్కడ TTP తన యోధులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం ప్రారంభించిందని చెబుతున్నారు. ఇస్లామాబాద్ పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాది విచారణ సమయంలో.. TTPకి చెందిన హాజీ లాలా ఇక్కడ సంస్థ యోధులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపినట్లు కథనాలు వచ్చాయి. ఇక్కడి శిక్షణ పొందిన తర్వాత ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తారని సమాచారం.
తెహ్రీక్-ఎ-తాలిబాన్ ఉద్దేశ్యం ఏంటి..
తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ. ఇందులో 6 వేలు నుంచి 6500 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఈ సంస్థ ఖైబర్ నుంచి పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వరకు చురుకుగా ఉంది. ఈ సంస్థకు ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆయుధాలు వస్తాయని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ ఈ ఆరోపణను పూర్తిగా తిరస్కరిస్తోంది. పాకిస్థాన్‌లో ఇస్లామిక్ పాలనను స్థాపించడమే తెహ్రీక్-ఇ-తాలిబాన్ లక్ష్యమని పలువురు పాక్ అధికారులు చెబుతున్నారు. వివాహం, మహిళల హక్కులకు సంబంధించి పాక్‌లోని అనేక చట్టాలను ఈ సంస్థ వ్యతిరేకిస్తుంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామిక్ సంప్రదాయాలను పాటించడం లేదని టీటీపీ వాదన. ఒకప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదానికి పాకిస్థాన్ ఊపిరి ఊదింది, ఇప్పుడు అదే ఇస్లామిక్ తీవ్రవాదం పాకిస్థాన్‌ను నిలువెలా దహనం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Asteroid Near Earth: భూమికి ప్రమాదం ఉందా? నాసా ఎందుకు ఆందోళనతో ఉంది..