TTD Tickets: భక్తులను అయోమయానికి గురిచేసిన టీటీడీ.. చివరకు ఏమైందంటే?

  • టిక్కెట్ల విషయంలో భక్తులను అయోమయానికి గురిచేసిన టీటీడీ
  • దర్శన సమయంలో తప్పుగా ప్రింట్
  • ఉన్నతాధికారుల జోక్యంతో సమస్య పరిష్కారం
Ttd Devotees

Ttd Devotees

Srivani Darshan Timing Issue: తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్ల విషయంలో చోటుచేసుకున్న సాంకేతిక పొరపాటు భక్తులను తీవ్ర అయోమయానికి గురిచేసింది. దర్శన సమయాన్ని సాయంత్రం 4 గంటలకు బదులుగా.. ఉదయం 4 గంటలుగా టిక్కెట్లపై ముద్రించడంతో పలువురు భక్తులు తెల్లవారుజామునే క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. అయితే అది శ్రీవాణి దర్శన సమయం కాకపోవడంతో.. టీటీడీ సిబ్బంది వారిని వెంటనే అనుమతించలేదు.

టిక్కెట్లలో ముద్రించిన సమయం ప్రకారం ఉదయం 4 గంటలకే క్యూ లైన్ వద్దకు చేరుకున్న భక్తులు దర్శనం కోసం ఎదురుచూశారు. కానీ ఆ సమయంలో శ్రీవాణి దర్శనం నిర్వహించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో భక్తులు టిక్కెట్లలో ఉన్న వివరాలను చూపిస్తూ.. టీటీడీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న టీటీడీ అధికారులు టిక్కెట్ ప్రింటింగ్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు గుర్తించారు. సాయంత్రం 4 గంటలకు ఉండాల్సిన దర్శన సమయం పొరపాటున ఉదయం 4 గంటలుగా ముద్రించబడినట్లు నిర్ధారించారు. ఈ తప్పిదంతో భక్తులు అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

అనంతరం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. భక్తులు ఇబ్బందిపడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న టీటీడీ.. వారిని ఉదయం నిర్వహించే వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి దర్శనానికి అనుమతించింది. దీంతో భక్తులు ఎట్టకేలకు శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం పొందారు. ఈ ఘటనతో శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల నిర్వహణలో టీటీడీ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక లోపాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.