TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!

  • టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
  • అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు
  • తిరుమలలో 51 ప్రాంతాలకు ఆధ్యాత్మిక పేర్లు
Ttd

Ttd

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా పలు అంశాలపై ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపనున్నాయి. తిరుమలలోని వరహస్వామి గెస్ట్ హౌస్-1 అభివృద్ధి పనుల కోసం రూ.3.6 కోట్ల నిధులు కేటాయించారు. అలాగే తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అలిపిరి వద్ద బస్సుల తనిఖీ కోసం రూ.4.5 కోట్లతో షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సాంస్కృతిక రంగంలో భాగంగా ప్రముఖ కళాకారిణి శోభరాజ్‌ను టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా నియమించారు. ఇక సత్యసాయి జిల్లా లేపాక్షిలో కళ్యాణ మండపం నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. టీటీడీ ఉద్యోగుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు దర్శనం, లడ్డు కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. అలాగే ఉద్యోగుల హెల్త్ స్కీం రీయింబర్స్‌మెంట్ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధి పనులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.

ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం కోసం ఇచ్చే నిధులను రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచేందుకు తిరుమలలో 51 ప్రాంతాలకు ఆధ్యాత్మిక పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఇక వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని మే 1 నుంచి జూలై 15 వరకు సిఫార్సు లేఖలను స్వీకరించకూడదని టీటీడీ నిర్ణయించింది. అదనంగా ఖమ్మంలో 20 ఎకరాల్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఆలయ నిర్మాణానికి ఇచ్చిన 20 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు.