Kasani Gnaneshwar React on TDP Contesting In Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని తాను కలిశానని, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి వివరించానని కాసాని తెలిపారు. మంగళవారం చంద్రబాబు బయటకు వస్తారని తాము ఆశిస్తున్నామన్నారు.
పలు కేసుల్లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. శనివారం బాబుతో కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా తాజాగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ… ‘టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో శనివారం ములాఖత్ అయ్యాం. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఆయనకు వివరించాం. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై దేశం వ్యాప్తంగా గా ఆందోళన ఉంది. బాబు ఆరోగ్యం గురుంచి అరా తీసి బాగోగులు అడగడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ విషయంలో, రాజకీయ పరంగా బుధవారం క్లారిటీ వస్తుంది. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వాటిని మేం ఖండిస్తున్నాం’ అని అన్నారు.
Also Read: IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. రియల్ గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న ‘బాస్’ హీరోయిన్!
‘తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుంది. ఎక్కడ, ఎప్పుడు అనే వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మా కంటే బలంగా ఉందనేది మేము నమ్మడం లేదు. జనసేనతో ముందుకు వెళ్లాలా లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. జాతీయ అధ్యక్షులు అక్రమ అరెస్ట్ విషయంలో అన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టాం. మంగళవారం చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లిస్ట్ సహా మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాం. తెలంగాణలో అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో ఉంటుంది’ అని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.