Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..

Trum

Trum

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లోని ఒకటి లేదా రెండు కీలక లక్ష్యాలను ఇప్పటికీ ఉపసంహరించుకోవాల్సి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న ‘పిక్‌యాక్స్ మౌంటెన్’ వంటి స్థావరాలను తాము కేవలం 10 నిమిషాల్లోనే నిర్వీర్యం చేయగలమని ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ వారు నమ్మదగినవారు కాదని, అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడేది లేదని సంకేతాలిచ్చారు. అమెరికాలో వచ్చే వారం జరగనున్న మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్‌లను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఏ రకమైన బెదిరింపు ఎదురైనా తక్షణమే భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా సమాధానం ఇస్తామని ఆర్మీ కమాండర్లతో జరిగిన సమావేశంలో తెలిపారు. అలాగే అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి చెందిన అన్ని రకాల ఆస్తులను తమ లక్ష్యాల జాబితాలో చేర్చాలని సైన్యాన్ని ఆదేశించారు. తమ పూర్వ నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన తర్వాత అధికారంలోకి వచ్చిన మొజ్తాబా ఖమేనీ, సైనిక ఉన్నతాధికారులతో ఇలాంటి సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి.

గత ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడులతో మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఆ దాడుల్లో అలీ ఖమేనీ మరణించగా, ప్రతికారంగా ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయడమే కాకుండా కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత జూన్‌లో ఇరు దేశాల మధ్య 14 అంశాల శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, అది కొద్దిరోజులకే రద్దయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఢీ అంటే ఢీ అనేలా రెండు దేశాలు ప్రకటనలు చేస్తుండటంతో, రాబోయే రోజుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.