పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ తప్పదా? మళ్లీ యుద్ధానికి దేశాలు సై అంటున్నాయా? ఇజ్రాయెల్ దూకుడు. ఇరాన్ మెలిక. శాంతి ఒప్పందానికి ప్రతిష్టంభన ఏర్పడిందా? మళ్లీ మూడు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయా? అంటే సంకేతాలు అలానే అనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే.. మరోసారి మధ్యప్రాచ్యం రక్తసిక్తమయ్యేలా కనిపిస్తోంది.
బుధవారం ఇరాన్‌తో 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో శాంతి పరిమళిస్తుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడింది. వైమానిక దాడుల్లో దాదాపు 254 మంది చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ వ్యవహారం ఇరాన్‌కు రుచించలేదు. అమెరికా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని భీష్మించుకుని హార్ముజ్ జలసంధిని మళ్లీ దిగ్బంధించింది. రాకపోకలు నిలిపివేసింది. లెబనాన్‌పై దాడులు ఆపకపోతే శాంతి చర్చలు ఉండబోవని ఇరాన్ అంటోంది. అయితే ఒప్పందం విషయంలో ఇరాన్ పొరబడుతోందని.. ఒప్పందం కేవలం ఇరాన్‌తో మాత్రమేనని.. లెబనాన్‌తో కాదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తేల్చి చెప్పారు.
తాజాగా మరోసారి అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి శాంతి ఒప్పందం కుదరకపోతే.. మునుపటి కంటే భీకరంగా దాడులు ఉంటాయని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది, అలాగే అదనపు ఆయుధ సామగ్రి అన్నీ అక్కడే కొనసాగుతాయని తెలిపారు. ఇప్పటికే బలహీనపడిన శత్రువును పూర్తిగా నిర్మూలించే వరకు ఈ మోహరింపు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. అసలైన ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసే వరకు అమెరికా వెనక్కి తగ్గదని ట్రంప్ స్పష్టం చేశారు. ఏదైనా కారణంతో ఒప్పందం అమలు కాకపోతే మాత్రం.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మరింత భారీ స్థాయిలో యుద్ధ చర్యలు ప్రారంభమవుతాయని హెచ్చరించారు.
ఇరాన్ దగ్గర ఏ మాత్రం అణ్వాయుధాలను కలిగి ఉండకూడదన్నది చాలా కాలం క్రితమే నిర్ణయించబడిందని.. అలాగే హార్ముజ్ జలసంధి ఎప్పటికీ తెరిచి, సురక్షితంగా ఉంచాలని పేర్కొన్నారు. ఇది గనుక జరగకపోతే మాత్రం… అమెరికా సైన్యం ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని.. అవసరమైతే తదుపరి చర్యలకు ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘అమెరికా మళ్లీ శక్తివంతంగా ముందుకు వస్తోంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇకపై ఇరాన్ బూటకపు మాటలు చెప్పొద్దని.. ఒప్పందం చేసుకోవాల్సిందేనన్నారు. ‘‘ఈలోగా మన గొప్ప సైన్యం సన్నద్ధమవుతూ.. విశ్రాంతి తీసుకుంటూ.. తదుపరి విజయం కోసం ఎదురుచూస్తోందని.. అమెరికా తిరిగి వస్తుంది!’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.