మన దేశంలో ప్రాంతాల వారీగా భాషలు పుట్టుకొచ్చాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మనకు ఎదురయ్యే అతి పెద్ద సమస్య భాష. వారు మాట్లాడే భాష మనకు అర్థం కాకపోవడంతో పూర్తి సమాచారాన్ని పొందలేకపోతాం. ట్రావెలర్లు, టూరిస్టులు ఈ సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్యకు త్వరలోనే తెరపడనుంది. మనం మాట్లాడిన భాషను అనువాదించి అవతలి వ్యక్తుల భాషలోకి మార్చే ఏఐ రానుంది. ఇందుకు సంబంధించిన స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ రూపకల్పనకు ఐఐటీ బాంబే కూడా తొడ్పాటునందిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మక పరిశీలన జరుగుతోంది. గూగుల్, అలెక్సా సాఫ్ట్‌వేర్ మాదిరిగా అరకొర అనువాదం, అర్థం చేసుకోకపోవడం వంటి సమస్యలు ఈ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తవని రూపకర్తలు చెబుతున్నారు. ఇప్పటి దాకా కూడా పార్లమెంట్‌లో సైతం సభ్యుల మాటల్ని మాన్యువల్‌గానే తర్జుమా చేస్తున్నారు.
భాష అర్థం కాకపోవడం వల్ల సమచారం చేరవేతలో లోపాలు తలెత్తుతున్నట్లు కొన్నేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లోని ఆచార్యులు, పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నట్లు కేంద్రానికి సమాచారమందింది. దీంతో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లను సెంట్రల్ సర్కార్ సంప్రదించింది. అనువాదం కోసం తాము భాషిణి పేరుతో ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాలని ప్రయత్నాలు చేస్తున్నామని, సహకరించాలని కేంద్రం కోరగా…ఆచార్యులు అంగీకరించారు. ఓ బృందాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించింది. భాషిణి వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ.. ఒక యాప్‌ను కూడా రూపొందించారు. ఇతరులు మాట్లాడిన మాటలను తర్జుమా చేసి.. మనం ఎంచుకున్న భాషలో నిమిషం.. నిమిషమున్నర వ్యవధిలో వినిపిస్తుంది. ఈ స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో మూడు అంశాలు కీలకంగా పరిగణించారు. అవే గుర్తింపు, రాత, మాట. ఈ మూడు అంశాలను ఒకేచోటికి చేర్చి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. ప్రసంగమైనా, పాటైనా, మాటైనా అది ఏ భాషలో ఉందో తొలుత ఇది గుర్తిస్తుంది. భాషను గుర్తించాక దానిని రాత (టెక్స్ట్)రూపంలోకి మారుస్తుంది. అనంతరం ఆ రాతను ఏ భాషలోకి కావాలంటే ఆ భాషలోకి మాటగా మారుస్తుంది. కొన్ని క్షణాల్లోనే ఇదంతా జరిగిపోయేలా పరిశోధనలు చేస్తున్నారు.
READ MORE: Nitin Gadkari: కాంగ్రెస్ చేసిన తప్పుల్ని మనం చేయకూడదు.. బీజేపీకి నితిన్ గడ్కరీ హెచ్చరిక..
70 శాతం పరిశోధన పూర్తి..
ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్‌పై 70 శాతం పరిశోధన పూర్తయిందని ప్రొఫెసర్ రమేష్ లోగనాథన్ తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్ ఓ ఖాతాదారు ఏదన్నా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే హిందీ, లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడేవారే ఉంటారన్నారు. ఖాతాదారు వేరే భాషలో మాట్లాడితే వారికి సరిగ్గా అర్థం కాదని.. స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చాక ఆ పరిస్థితి తొలుగుతుందని వెల్లడించారు. ఖాతాదారు ఏ భాషలో మాట్లాడినా కస్టమర్ కేర్ సెంటర్‌లో ఉంటున్న వ్యక్తికి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. అక్కడి వ్యక్తికి తెలిసిన భాషలోకి అప్పటికప్పుడే తర్జుమా అయిపోయి వినిపిస్తుందన్నారు. పద్నాలుగు భారతీయ భాషల్లోకి ఏకకాలంలో అనువాదమయ్యే స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని వెల్లడించారు.