Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!

Emergency Landing

Emergency Landing

Emergency Landing: మహారాష్ట్రలో ఓ శిక్షణా విమానం అత్యవసర పరిస్థితుల్లో చెరుకు పొలంలో ల్యాండ్ కావడం కలకలం రేపింది. రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకు చెందిన ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సాంకేతిక లోపంతో నేటి ఉదయం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతి సమీపంలోని గోజుబావి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉదయం సుమారు 8:40 గంటల సమయంలో శిక్షణలో భాగంగా విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. గ్రామానికి ఉత్తర దిశలో సుమారు 1.5 కి.మీ. దూరంలో ఉండగా విమానం ఇంజిన్ పవర్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

అయితే పరిస్థితిని చాకచక్యంగా ఎదుర్కొన్న ట్రైనీ పైలట్ సమీపంలోని చెరుకు పొలంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. భూమిపై ఉన్న ప్రజలకు ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. అయితే అత్యవసర ల్యాండింగ్ కారణంగా ట్రైనీ పైలట్ తీవ్ర షాక్‌కు గురైనట్లు సమాచారం.

విమానం పొలంలో దిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సాంకేతిక లోపానికి అసలు కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే గోజుబావి గ్రామంలో ఇంతకుముందు కూడా విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ అత్యవసర ల్యాండింగ్ ఘటనపై అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఇంజిన్ ఫెయిల్యూర్ కారణాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.