వినాయక నిమజ్జనాల సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమలవుతాయి. ఇవాళ అర్థరాత్రి నుంచే హైదరబాద్‌లోకి జిల్లాలు, అంతర్రాష్ట లారీల ప్రవేశంపై నిషేధం విధించారు. ఆర్టీసీ బస్సులను కూడా పలు చోట్ల దారి మళ్లిస్తారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు గణేశ నిమజ్జన యాత్ర మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని కోరుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. గణేశ్ నిమజ్జనాల శోభాయాత్ర రూట్ మ్యాప్‌తో పాటు ట్రాఫిక్ ఆంక్షల సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్‌లో పొందుపర్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది.
దీంతో గూగుల్ మ్యాప్స్‌లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేలా ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే, ట్రాఫిక్ ఆంక్షలు, తాజా పరిస్థితులపై సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే గణేశ శోభాయాత్ర ఫలక్‌నుమా మీదుగా చార్మినార్ చేరుకుంటుంది. అక్కడి నుంచి అఫ్జల్‌గంజ్, గౌలిగూడ చమాన్, MJ మార్కెట్, అబిడ్స్‌కు వస్తుంది. అక్కడి బషీర్‌బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా NTR మార్గ్‌కు విగ్రహాలను మళ్లీస్తారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే శోభాయాత్ర ఆర్పీ రోడ్ మీదుగా కర్బాల మైదానం చేరుకుంటుంది. అక్కడి నుంచి కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా సాగుతుంది. ఈ మార్గంలో వచ్చే వినాయక విగ్రహాలను ట్యాంక్ బ్యాండ్ గాని NTR మార్గ్ వైపుగాని తరలిస్తారు.
ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్ మీదుగా అంబర్‌పేట జంక్షన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి మీదుగా లిబర్టీ జంక్షన్‌కు వస్తుంది. అలాగే, దిల్సుఖ్నగర్, ఐఎస్‌సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా సాగుతుంది. టోలిచౌకి నుంచి బయలుదేరే శోభాయాత్ర రేతి బౌలి, మెహదీపట్నం మీదుగా మాసబ్ ట్యాంక్ చేరుకుంటుంది. అక్కడి నుంచి నిరంకారి భవన్ మీదుగా NTR మార్గ్ వైపు మళ్లిస్తారు. మెహదీపట్నం, తపచ్ బుత్రా అసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహాల ఊరేగింపులు సీతారాంబాగ్ మీదుగా సాగుతాయి. బోయగుడ కమాన్, గోశామహల్ బారదారి, MJ మార్కెట్ మీదుగా ముందుకు ట్యాంక్ బండ్‌కు తరలివెళ్తాయి. ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్ మీదుగా వచ్చే శోభాయాత్ర అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా NTR మార్గ్‌కు చేరుకుంటుంది.