NTV Telugu Site icon

Revanth Reddy: రైతులకు ఉచిత కరెంటు పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్..

Revanth Reddy In Makhtal

Revanth Reddy In Makhtal

Revanth Reddy: 119లో కేసీఆర్ ఒక్క ముదిరాజు బిడ్డకు కూడా టికెట్ ఇవ్వలేదంటే ఆయనకు వాళ్ల ఓట్లు అక్కర్లేదన్నట్టేనా అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ ముదిరాజులకు 4 టికెట్లు ఇచ్చిందన్నారు. ముదిరాజులకు కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించిందన్నారు. మక్తల్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నియోజకవర్గంలో ఇసుక దందా, భూ ఆక్రమణలు ఎక్కడ జరిగినా ఇక్కడి ఎమ్మెల్యే పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాల్లోనూ కమీషన్లు దండుకుంటున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యేకు కప్పం కట్టనిదే ఏ పనీ జరగడం లేదన్నారు. మక్తల్‌కు ఎమ్మెల్యే చేసిందేం లేదన్నారు. ఇసుక దోపిడీ, భూ ఆక్రమణ, పేదలను గన్‌మెన్‌లను మెడపట్టి గెంటించడమా ఈ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి అంటూ ప్రశ్నించారు.

Also Read: Congress: జగ్గారెడ్డి వర్సెస్ దామోదర రాజనర్సింహ.. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ

నువ్వు మెడపట్టి గెంటడం కాదు.. ప్రజలే నిన్ను మెడపట్టి ఈడ్చేస్తారన్నారు. రైతులకు ఉచిత కరెంటు పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్ అంటూ పేర్కొన్నారు. 24గంటల కరెంటు ఇస్తున్నామని కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని విమర్శలు గుప్పించారు. ఎవరొస్తారో రండి.. సబ్ స్టేషన్‌కు వెళ్లి లాగ్ బుక్‌లు చూద్దామంటూ సవాల్ విసిరారు. 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే మేం ఎమ్మెల్యేలుగా నామినేషన్ వేయమంటూ ఛాలెంజ్ చేశారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. మీ కల్లబొల్లి కబుర్లు నమ్మడానికి రైతులు సిద్ధంగా లేరన్నారు. రెండు సార్లు అధికారం ఇస్తే లక్ష కోట్లు దోచుకున్నారని.. మూడోసారి ఇస్తే ఇంకో లక్ష కోట్లు దోచుకుంటారని ఆరోపించారు.

Also Read: PM Modi: తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తాం..

మూడోసారి అధికారం ఇస్తే ఇంట్లో తన మనవడికి కూడా పదవి ఇచ్చుకుంటాడని రేవంత్ అన్నారు. గుడిని గుడిలో లింగాన్ని మింగే వాడుంటాడాని విన్నాం.. ఇప్పుడు కేసీఆర్‌ను చూస్తున్నామన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్… బెల్టుషాపుల తెలంగాణ చేశారని ఆరోపణలు చేశారు. గ్రూపులు గుంపులు పక్కనబెట్టి… అంతా ఏకమై పాలమూరులో 14 కు 14 సీట్లు గెలిపించాలని ప్రజలను కోరారు. అప్పుడే పాలమూరు జిల్లా అభివృద్ధిలో ముందుకెళుతుందన్నారు.