ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసులు:
నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నీటి కోసం ఏపీ, తెలంగాణ పోలీసుల వివాదం తారాస్థాయి చేరుతున్నాయి. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులతో పాటు రాష్ట్రంలోని నీటిపారుదల అధికారులపై తెలంగాణ ఎస్పీఎఫ్‌ను ప్రయోగించారు. అర్థరాత్రి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని, ఏపీ పోలీసులు అనుమతి లేకుండా డ్యాం వద్దకు వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇక మరోవైపు నాగార్జున సాగర్ ప్రధాన డ్యామ్ వద్దకు కృష్ణా రివర్ బోర్డు అధికారులు చేరుకున్నారు. డ్యాంపై 13వ గేట్ దగ్గర ఏపీ, తెలంగాణ అధికారుల చర్చలు జరుగుతున్నాయి.
వారందరి ఈరోజు సెలవు:
ఉపాధ్యాయ సంఘం అభ్యర్థన మేరకు ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సెలవు ప్రకటిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. బుధ, గురువారాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తూ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
బెంగళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు:
బెంగళూరులోని 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు స్థానికంగా కలకలం సృష్టించింది. బాంబు పేలుడు జరుపుతామని శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్స్ పంపారు. దీంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. దీంతో సంబంధిత పాఠశాలలను పోలీసులు ఖాళీ చేయించారు. అన్నింటిలో మొదటిది, ఏడు పాఠశాలల్లో బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. బసవేశ్వర్ నగర్‌లోని నేపెల్, విద్యాశిల్ప పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి ఎదురుగా ఉన్న పాఠశాలకు కూడా బెదిరింపులు వచ్చాయి.
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం:
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కెందుజార్‌లో శుక్రవారం ఉదయం 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20వ నంబర్ జాతీయ రహదారి బలిజోడి సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
డిసెంబర్‌లో 18 రోజులు బ్యాంకులు బంద్:
2023 డిసెంబర్లో బ్యాంకులకు ఏకంగా 18 రోజులు సెలవులు ఉన్నాయి. ఐదు ఆది వారాలు.. రెండో, నాలుగో శని వారాలతో కలిపి ఈ నెలలో18 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇందులో ఆర్బీఐ హాలిడే లిస్టుతో పాటు ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు ఉన్నాయి. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయన్న విషయం తెలిసిందే.
సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూత:
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బలక్ష్మి.. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు సౌభాగ్య సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సుబ్బలక్ష్మి మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతికి నివాళులర్పించారు.
వెస్టిండీస్ కీపర్ అనూహ్య నిర్ణయం:
వెస్టిండీస్ కీపర్ షేన్ డౌరిచ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో 32 ఏళ్ల డౌరిచ్‌కు చోటు లభించినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. దాంతో ఇంగ్లండ్ సిరీస్ ఆడకుండానే.. డౌరిచ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. డౌరిచ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పట్ల విండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్యుఐ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది.